Trump Tariffs: ప్రపంచ వాణిజ్యంలో మళ్లీ అమెరికా – చైనా – భారత్ పేర్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వరుస నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త చర్చలకు దారితీశాయి.
తాజాగా ట్రంప్ ఒక కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసి, చైనాపై ఉన్న టారిఫ్ డెడ్‌లైన్‌ను మరో 90 రోజులు పొడిగించారు. అంటే, ఆగస్టు 12 నుంచి అమల్లోకి రావాల్సిన అధిక పన్నులు ఇప్పుడేమో నవంబర్ మధ్య నుంచి మాత్రమే అమలు అవుతాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని గంటల ముందు ట్రంప్, చైనా వాణిజ్య చర్చల్లో చూపిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. గత కొన్ని నెలలుగా అమెరికా – చైనా మధ్య పలు రౌండ్ల వాణిజ్య చర్చలు జరిగాయి. వాటి ఫలితంగానే ఈ టారిఫ్ గడువు పొడిగింపు సాధ్యమైంది. కానీ ఈ వెనుక ఉన్న చరిత్ర మాత్రం చాలా ఘాటుగా ఉంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. టారిఫ్‌లు 100 శాతం దాటాయి. ట్రంప్ ప్రభుత్వం చైనాపై నేరుగా 145% పన్ను విధించింది. దానికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 125% పన్ను వేసింది. ఇలా ఇరువైపులా వాణిజ్యం కష్టాల్లో పడింది. తర్వాత మే నెలలో, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో రెండు దేశాల ప్రతినిధులు తొలిసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత ఇరు దేశాలు తాత్కాలిక విరామం ప్రకటించి, పన్నులను గణనీయంగా తగ్గించాయి. అమెరికా తన టారిఫ్ రేటును 30%కు, చైనా 10%కు తగ్గించింది.
ఇప్పుడు ఈ చైనా టారిఫ్ గడువు పొడిగింపు వార్త కాస్త సానుకూలంగా కనిపించినా, భారత్ విషయానికి వస్తే పరిస్థితి వేరుగా ఉంది. ఎందుకంటే అమెరికా, భారత్‌పై భారీ పన్నులు విధించింది. ఆగస్టు ప్రారంభంలో అమెరికా, భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25% పన్ను విధించింది. అయితే, కేవలం కొన్ని రోజుల్లోనే ఆ రేటును 50%కు పెంచేశారు. కారణం – రష్యా – ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించడం.
అమెరికా అభిప్రాయం ప్రకారం, రష్యా నుంచి చమురు కొనడం అంటే యుద్ధ సమయంలో రష్యాకు ఆర్థిక మద్దతు ఇవ్వడమే. అందుకే ఈ ఆర్థిక ఒత్తిడి పన్నులు విధించారు. కానీ భారత్ మాత్రం దీనిని పూర్తిగా తిరస్కరించింది. ఈ పన్నులు అన్యాయమని, అమెరికా డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందని కఠినంగా స్పందించింది. భారత్ వాదన ప్రకారం, అమెరికా తానే కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తోంది. అలాంటప్పుడు భారత్‌పై మాత్రమే ఇంత కఠిన పన్నులు విధించడం సరైంది కాదని తేల్చి చెప్పింది.
మొత్తం మీద, అమెరికా – చైనా మధ్య టారిఫ్ గడువు పొడిగింపు ఒక సానుకూల సూచనగా ఉన్నా, అమెరికా – భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మాత్రం ఈ భారీ పన్నుల వల్ల కాస్త గందరగోళంలో పడ్డాయి. ప్రపంచ మార్కెట్‌లో మూడు పెద్ద ఆర్థిక శక్తులు — అమెరికా, చైనా, భారత్ — వాణిజ్య సంబంధాలపై తీసుకునే ప్రతి నిర్ణయం మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే రాబోయే నెలల్లో ఈ పన్ను – చర్చల ఆటతీరు ఎలా మారుతుందో చూడాలి.