HBD Ilayaraja: మ్యూజిక్ మాస్ట్రో గా పేరు సొంతం చేసుకున్న ఇళయరాజా (Ilayaraja ) సంగీత దర్శకుడుగానే కాకుండా పాటల రచయితగా, గాయకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 30 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5వేల పాటలకు , 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇకపోతే చెన్నైలో నివసిస్తున్న ఈయన 1970, 1980, 1990 లలో దక్షిణ సినీ పరిశ్రమలో గొప్ప సంగీత దర్శకుల్లో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. తమిళ జానపద పాటల రచన శైలిని ఏకీకృతం చేసిన ఈయన.. దక్షిణ భారత సంగీతంలో.. పాశ్చాత్య సంగీతంలో కూడా విశాలమైన , వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టి అందరిని ఆకట్టుకున్నారు. ఇక తన అద్భుతమైన ప్రతిభతో నాలుగు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఈయన తన హంగరీలో ప్రఖ్యాత బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా ను ఉపయోగించేవారు. 1993న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తిస్థాయి సింఫనీని కంపోజ్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు కూడా సృష్టించారు. అంతేకాదు ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి కూడా ఈయనే. ఇకపోతే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఈయన మ్యూజిక్ మ్యాస్ట్రోగా ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం అని చెప్పాలి.
పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇళయరాజా..
ఇక ఈయన బాల్యం , విద్యాభ్యాసం విషయానికి వస్తే.. తమిళనాడు రాష్ట్రంలో, తేని జిల్లా పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించారు. వ్యవసాయ ప్రాంతంలో పెరగడం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో ఆయనకు జానపద సంగీతం పరిచయం అయ్యింది. ఆయనలోని సంగీత జ్ఞానం ఆయన 14 ఏట బయటపడగా.. ఆ వయసులో ఇళయరాజా తన సవతి సోదరుడు అయిన వరదరాజన్ సంగీత బృందంలో చేరి ఊరురా తిరుగుతూ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రచారాలు చేపడుతూ సంగీత కచేరీలు ఇచ్చేవారు. తన సోదరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు గ్రామాలు, పట్టణాలలో కచేరి నిర్వహించి, మంచి పేరు సొంతం చేసుకున్నారు.
అద్భుతమైన జ్ఞానంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు..
ఇక ఇళయరాజా సినిమా జీవిత విషయానికి వస్తే.. చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలు ఇచ్చే బృందంలో ఒక సభ్యుడుగా చేరి, తన సంగీత జీవితాన్ని ప్రారంభించారు. సంగీతం రికార్డ్ జరుపుకునే పశ్చిమ బెంగాల్ కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీబోర్డు కళాకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత కన్నడ సంగీత దర్శకుడైన జీ.కే.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరి చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం పెంచుకున్నారు. ఈయన దగ్గరే 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేసిన ఇళయరాజా.. ఈ సమయంలో కాస్త ఖాళీ దొరికితే చాలు ఆర్కెస్ట్రాలోని కళాకారుల దగ్గర సాధన చేస్తూ అందులోని మెలకువలను తెలుసుకున్నారు. ఇక 1976లో అన్నక్కలి అనే సినిమాకి తొలిసారి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక అలా ఒక్కొక్క సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తూ.. 5 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, 3 కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులతో పాటు 3 నంది అవార్డులు, 4 జాతీయ అవార్డులు, ఒక స్క్రీన్ అవార్డు అలాగే 6 తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డులు లభించాయి. అలా మొత్తం 27 అవార్డులకు నామినేషన్ జరగగా.. 24 అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఈయనకు అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ‘ఇసైజ్ఞాని’ అనే బిరుదు తో పాటు కలైమామణి పురస్కారం కూడా అందించారు.
ALSO READ:HBD Maniratnam: మణిరత్నం కెరియర్లో కీలక ఘట్టాలు.. ఆశ్చర్యపరిచే అంశాలివే!