Engineering Admissions: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో చేరే మేనేజ్‌మెంట్ విద్యార్థులకు అలర్ట్. ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 19 నుంచి మొదలై ఆగస్టు 10 వరకు అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది.
తెలంగాణలో 2025-26కు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి ఆ షెడ్యూల్‌ని ప్రకటించింది. ఈ నెల 19 నుంచి ఈ అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకానుంది. బీటెక్, ఫార్మా కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటాలో 30 శాతం సీట్లను భర్తీ కానున్నాయి.
దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా లేదా డైరెక్ట్‌గా కాలేజీలో అందజేయవచ్చని అందులో ప్రస్తావించింది. విద్యార్థులు కళాశాల మేనేజ్‌మెంట్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ లేదా పేమెంట్ గేట్ వే ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కళాశాలలకు దరఖాస్తు చేస్తే.. ప్రతి కళాశాలకు ప్రత్యేకంగా దరఖాస్తు, రుసుము చెల్లించాలి. ఈ విషయాన్ని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లను ప్రభుత్వం కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా 30 శాతం సీట్లను బీ కేటగిరీ కింద కేటాయిస్తారు. నిబంధనల ప్రకారం ఆయా సీట్లను కన్వీనర్ కోటా ఫీజుతో మెరిట్ ఆధారంగా ఇవ్వాలి. చాలా కళాశాలలు డొనేషన్ల పేరిట ఆయా సీట్లను లక్షల్లో విక్రయిస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు.
ALSO READ: గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీతో 5208 ఉద్యోగాలు, కేవలం నాలుగు రోజులు మాత్రమే
కొన్ని కళాశాలలు 30 శాతంలో సగం సీట్లను ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత విద్యార్థులకు కేటాయిస్తాయి. ఆ సీట్లకు 5 వేల అమెరికన్ డాలర్లకు సమానంగా ఫీజు తీసుకోవచ్చు. ప్రస్తుతం డిమాండ్ లేకపోవడంతో మిగతా బ్రాంచీలకు ఫీజులు సగానికిపైగా తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.
గతేడాది జులై 31న నోటిఫికేషన్ జారీ చేసింది విద్యామండలి. ఈసారి 12 రోజులు ముందుగా అనుమతి ఇచ్చింది. ప్రవేశాలు ఆలస్యమైతే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చేరే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది సుమారు 28 వేల మంది బీ కేటగిరీ ప్రవేశాలు పొందారు.
ప్రస్తుతం ఇంజినీరింగ్ మొదటి దశ సీట్ల కేటాయింపు జాబితా విడుదలైంది. జూన్ 28న తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. 95 వేల విద్యార్థులు హాజరు కాగా అందులో సుమారు 94 వేల మంది నచ్చిన కాలేజీల్లో సీట్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఈసారి మాక్ అలాట్‌మెంట్ విధానాన్ని ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టింది.