CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరతారు. తొలుత జట్‌ప్రోల్ చేరుకుని.. మదన గోపాలస్వామి దేవాలయం సహా చుట్టుపక్కల ఉన్న ఆలయాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
యంగ్ ఇండియా స్కూల్‌కు శంకుస్థాపన
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ స్కూల్ ప్రాజెక్టు ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య కోసం.. వలస పోయే పరిస్థితిని తగ్గించేందుకు దోహదపడనుంది. ప్రాథమిక నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను ఉచితంగా, ఆంగ్ల మాధ్యమంలో అందించే విధంగా.. రూపొందించిన ఈ పథకం ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటిగా నిలుస్తోంది.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ఆ తర్వాత సభా వేదికపై “ఇందిరా మహిళా శక్తి” పథకంలో భాగంగా.. స్వయం సహాయక సంఘాల మహిళలకు.. వడ్డీ లేని రుణాలకు సంబంధించి చెక్కులను పంపిణీ చేయనున్నారు సీఎం.
బహిరంగ సభలో సీఎం
శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. స్థానిక ప్రజలతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఈ సభలో ముఖ్యమంత్రి తన పాలనపై ప్రజలకు వివరాలు అందించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాక, గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినే అవకాశం కూడా సీఎం ఈ సభ ద్వారా కల్పించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ కసరత్తు
ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయంగా ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తోంది. ఇటీవలే జడ్పీటీసీ (ZPTC) ఎంపీటీసీ (MPTC) స్థానాల ఖరారుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
తెలంగాణలో మొత్తం 538 జడ్పీటీసీ, 5391 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. అయితే, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త గ్రామాలు, వార్డులు ఏర్పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా గ్రామ విభజనలు, కొత్త రెవెన్యూ గ్రామాల ఏర్పాటుతో.. స్థానాల సంఖ్య మారే అవకాశం ఉందని సమాచారం.
సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం బాట
ఈ పరిణామాలన్నీ సీఎం పర్యటనకు మరింత ప్రాధాన్యతను తెచ్చాయి. అభివృద్ధికి మద్దతుగా విద్యా రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు, ప్రజాపాలనకు అనుగుణంగా స్థానిక సంస్థల బలోపేతానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ అభివృద్ధికి స్థిరమైన ప్రణాళికలు రూపొందించాలన్న లక్ష్యంతో.. ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై.. AI వీడియో వైరల్
నేడు జరిగే పర్యటన నాగర్‌కర్నూల్ జిల్లాకు మైలురాయిగా నిలిచే అవకాశముంది. ఒకవైపు ఆలయ సందర్శనతో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూ, మరోవైపు విద్యా ప్రాజెక్టుకు శంకుస్థాపనతో.. భవిష్యత్ తరాల అభివృద్ధికి బీజం వేయనున్న ముఖ్యమంత్రి పర్యటనపై.. జిల్లావాసుల్లో ఆశాభావం నెలకొంది. రాబోయే రోజుల్లో ఇటువంటి పర్యటనలు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రగతికి దారి చూపే సూచనలు కనిపిస్తున్నాయి.