CBSE Class 12 results-2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ-2026 ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 85.20 శాతంగా నమోదు అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే 3.19 శాతం తక్కువ. ఈ ఫలితాల్లో బాలికలు ఈసారి బాలురలు కంటే 6.73 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 గా నమోదు అయ్యింది. బాలుర ఉత్తీర్ణత శాతం 82.13గా ఉంది.
సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు విడుదల
ప్రాంతాల వారీగా చూస్తే తిరువనంతపురంలో అత్యధికంగా 95.62 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. ప్రయాగ్‌రాజ్‌లో అత్యల్పంగా 72.43 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగాయి. పరీక్షలు తర్వాత మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలను వెబ్‌సైట్, డిజిలాకర్, ఉమంగ్ వంటి యాప్‌ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా సీబీఎస్ 12వ తరగతి ఫలితాల్లో పాస్ పర్సెంటేజ్ దాదాపు మూడు శాతం తగ్గింది. 17,80,365 మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 17,68,968 మంది పరీక్ష రాశారు. 15 లక్షల 07,109 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పర్సేంటేజ్ పరంగా చూస్తే 85.2 శాతం కాగా, గతేడాది 88.39గా ఉండేది.
అబ్బాయిల కంటే అమ్మాయిలు ఉత్తీర్ణత ఎక్కువ
విద్యార్థులు తొలుత అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.in ను సందర్శించండి CBSE Class 12 Result 2026 లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రోల్ నంబర్, పాఠశాల నెంబరు, అడ్మిట్ కార్డ్ ఐడిని ఎంటర్ చేయాలి. అప్పుడు ఫలితాలు ప్రత్యక్షమవుతాయి. దీనికితోడు విద్యా పత్రాలను సులభంగా పొందేందుకు వీలుగా సీబీఎస్ఈ డిజిలాకర్, ఉమాంగ్ యాప్ ద్వారా డిజిటల్ మార్క్‌షీట్‌లు పొందవచ్చు.
ఒక సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులను కంపార్ట్‌మెంట్ కేటగిరీలో ఉంచుతారు. ఆయా విద్యార్థులు జూలై జరగబోయే సప్లిమెంటరీ పరీక్షకు హాజరుకావచ్చు. కంపార్ట్‌మెంట్ పరీక్షలో పాసైతే ఆ విద్యార్థి సీబీఎస్ఈ 12వ బోర్డు పరీక్షలను క్లియర్ చేసినట్లుగా పరిగణించబడతారు. రెండు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైతే విద్యార్థులు వచ్చే ఏడాది పరీక్షలకు తిరిగి హాజరు కావాల్సి ఉంటుంది.
ALSO READ: దేశవ్యాప్తంగా నీట్-2026 పరీక్ష రద్దు.. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ, త్వరలో కొత్త షెడ్యూల్
దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది సీబీఎస్ఈ విభాగం. ఈసారి ఫలితాల్లో పెయింటింగ్ సబ్జెక్ట్ అత్యధిక స్కోరు సాధించింది. అందులో 15,334 మంది విద్యార్థులు 100కి 100 మార్కులు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 3,326 మంది విద్యార్థులు రెండవ స్థానంలో నిలిచారు.
ఈసారి కంపార్ట్‌మెంట్ కేటగిరీలో 1,63,800 మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 9.26 శాతం మంది. జవహర్ నవోదయ విద్యాలయాలు- 98.47 శాతం, కేంద్రీయ విద్యాలయాలు-98.55 శాతం, స్వతంత్ర పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 84.22 శాతంగా ఉంది. విదేశీ పాఠశాలల్లో 90.50 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.