బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) తీపి కబురు అందించింది. ముంబయిలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ విభాగం, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఉద్యోగాలు.. వెకెన్సీ వివరాలు..
మొత్తం 350 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ కేటగిరీకి 52, ఎస్టీకి 25, ఓబీసీకి 94, ఈడబ్ల్యూఎస్‌కు 35, జనరల్ (UR) కేటగిరీకి 144 పోస్టులను కేటాయించారు. ప్రధానంగా రెండు విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి:
ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఆఫీసర్ (స్కేల్-III): 50 పోస్టులు
మార్కెటింగ్ ఆఫీసర్-I: 300 పోస్టులు
విద్యార్హత వివరాలు..
అభ్యర్థులు పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీఏ (MBA) లేదా పీజీడీఎం (PGDM) ఉత్తీర్ణతతో పాటు బీఎఫ్ఎస్‌ఐ (BFSI) రంగంలో అనుభవం ఉండాలి. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఆఫీసర్ పోస్టులకు ఫారెక్స్ లేదా ట్రేడ్ ఫైనాన్స్‌లో బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి.
వయస్సు, వేతన వివరాలు..
స్కేల్-I పోస్టులకు (మార్కెటింగ్) దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 23 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. స్కేల్-III (ఫారెక్స్) పోస్టులకు 30 నుండి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. స్కేల్-III పోస్టులకు సుమారు రూ. 1,05,280, స్కేల్-I పోస్టులకు రూ. 85,920 వరకు నెలవారీ వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం..
అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుముగా సాధారణ అభ్యర్థులు రూ. 850 (ప్లస్ జీఎస్‌టీ), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 175 (ప్లస్ జీఎస్‌టీ) చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే జనవరి 20, 2026న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15, 2026 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ పరీక్షను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: జనవరి 20
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 15