Job No Resume Necessary| ఉద్యోగం పొందడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టంతో కూడుకున్న విషయం. బాగా ఉన్న చదువులు ఉండాలి. ఏదైనా ప్రఖ్యాత కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కేవలం చదువులే కాదు, నైపుణ్యాలు ఉండడం ముఖ్యం. ఆ నైపుణ్యాలను రెజ్యూమ్‌లో (సివిలో) ఆకట్టుకునేలా ప్రదర్శించాలి. లేకపోతే ఉద్యోగం దొరకడం కష్టమే. అయితే, ఇవేవీ లేకుండా లక్షల్లో జీతం సంపాదించే జాబ్ ఇస్తానని బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ వ్యవస్థాపకుడు ఫౌండర్ ప్రకటించారు.
బెంగళూరులో ఉద్యోగం: ఏడాదికి రూ. 40 లక్షల జీతం
బెంగళూరులో ఉద్యోగ ఖాళీలున్నాయి. సంవత్సరానికి రూ. 40 లక్షల జీతం. కానీ వారానికి ఐదు రోజులు ఆఫీస్ నుంచే పని చేయాలి. పేరొందిన కళాశాల నుంచి చదివడం తప్పనిసరి కాదు, అనుభవం కూడా పెద్దగా అవసరం లేదు. చివరికి రెజ్యూమ్‌తో కూడా పని లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని కంపెనీ వ్యవస్థాపకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఆసక్తికర పోస్ట్ గురించే నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.
బెంగళూరులోని ఇందిరానగర్‌లోని తమ కార్యాలయానికి సున్నా నుంచి రెండేళ్ల వరకూ అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నియమించుకోవాలని చూస్తున్నట్లు ‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీ అధినేత సుదర్షన్ కామత్ తెలిపారు. “‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్‌ను నియమించాలని చూస్తున్నాం. ఉద్యోగం కావల్సిన వారు 100 పదాలలో తమ పరిచయం చేసుకునే విధంగా టెక్స్ట్ పంపండి చాలు,” అని ట్విట్టర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. “మీరు ఏ కళాశాలలో చదివారు అనేది ముఖ్యం కాదు, రెజ్యూమ్ కూడా అవసరం లేదు,” అని కామత్ పేర్కొన్నారు.
“క్రాక్డ్ ఇంజనీర్స్” అంటే నూతన మార్పులు చేయడానికి భయపడని అత్యంత సమర్థవంతులైన, ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను వర్ణించడానికి ఉపయోగించే పదం. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. ఆకట్టుకునే రెజ్యూమ్ కంటే నైపుణ్యాలకు కామత్ ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఎక్స్ యూజర్లు ప్రశంసించారు. అయితే, క్రాక్డ్ ఇంజనీర్‌కు ఈ జీతం చాలా తక్కువ అని మరికొందరు వ్యాఖ్యానించారు.
Also Read: డిగ్రీ అర్హతతో 650 ఉద్యోగాలు.. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.. జీతం మాత్రం రూ.6,00,000
మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉన్న ఉద్యోగాలు
ప్రతి వ్యక్తి మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉన్న ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. దీనితో పాటు ఎక్కువ జీతం కూడా. ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలలోనే ఈ రెండూ లభిస్తాయి. US న్యూస్ బెస్ట్ జాబ్స్ లిస్ట్ రూపొందించింది. ఈ లిస్ట్ రూపొందించడానికి, పని గంటలు, పని భారం, రిమోట్ వర్క్ మినహాయింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉన్న టాప్ ఉద్యోగాలు ఇవే..
లైబ్రేరియన్
ప్రపంచంలోని బెస్ట్ ఉద్యోగాల లిస్టులో లైబ్రేరియన్ మొదటి స్థానంలో నిలిచింది. లైబ్రరీలో పుస్తకాలను స్టోర్ చేయడం లైబ్రేరియన్ పని. ఈ ఉద్యోగం మాస్టర్స్ డిగ్రీ చేసినవారు చేయవచ్చు. అమెరికాలో లైబ్రేరియన్ సగటు వార్షిక జీతం $64,370 (సుమారు రూ. 56 లక్షలు).
మార్కెటింగ్ మేనేజర్
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉన్న ఉద్యోగాలలో మార్కెటింగ్ మేనేజర్ రెండవ స్థానంలో ఉంది. మార్కెటింగ్ మేనేజర్ పని కొత్త మార్కెటింగ్ క్యాంపైన్‌లను రూపొందించడం మరియు అమలు చేయడం. మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే మీరు ఈ ఉద్యోగం చేయవచ్చు. ఈ పోస్టులో సగటు వార్షిక జీతం $1,57,620 (సుమారు రూ. 1.37 కోట్లు).
సామాజిక సేవా నిర్వాహకులు
సామాజిక సేవా నిర్వాహకులు సాధారణంగా వివిధ సంఘాలతో కలిసి పనిచేస్తారు. వీరు నిరాశ్రయులు మరియు అనాథలకు సహాయం చేస్తారు. ఈ రంగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే దాని ద్వారా సోషల్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ మేనేజర్ ఉద్యోగానికి మీరు అర్హులవుతారు. దీనికి సగటు వార్షిక జీతం $77,030 (సుమారు రూ. 67 లక్షలు).
ఆక్యుపేషనల్ థెరపిస్ట్
ఆక్యుపేషనల్ థెరపిస్టులు అంటే రోగుల రోజువారీ జీవితానికి అనుగుణంగా మారడానికి సహాయపడే లైసెన్స్ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు. వీరు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, మానసిక ఆసుపత్రులలో పనిచేస్తారు. ఒక ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సగటు వార్షిక జీతం $96,370 (సుమారు రూ. 84 లక్షలు).
ఐటీ మేనేజర్
ఒక కంపెనీ మౌలిక, సాంకేతిక సదుపాయాలను పర్యవేక్షించడం ఐటీ మేనేజర్ చేయాల్సిన పని. ఈ ఉద్యోగంలో భాగంగా.. వీరు నెట్‌వర్క్‌లు, వ్యవస్థలు మరియు సైబర్ భద్రత వంటి వాటిని కూడా చూసుకోవాలి. అమెరికాలో ఐటీ మేనేజర్ సగటు వార్షిక జీతం $1,69,510 (రూ. 1.47 కోట్లు).
వెబ్ డెవలపర్
వెబ్‌సైట్‌లు, వెబ్ అప్లికేషన్‌లను సృష్టించేవారినే వెబ్ డెవలపర్స్ అని అంటారు. వెబ్ డెవలపర్‌లుగా పనిచేసే వ్యక్తులు ఇంటి నుంచే పనిచేసుకుంటూ సాధారణంగా మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కలిగి ఉంటారు. వెబ్ డెవలపర్ సగటు వార్షిక జీతం $84,960 (రూ. 73.50 లక్షలు).
మసాజ్ థెరపిస్ట్
మసాజ్ థెరపిస్ట్ ఉద్యోగం.. ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగాల్లో ఒకటి. మసాజ్ థెరపిస్ట్ పని ప్రజలను నొప్పి నుండి ఉపశమనం చేయడమే. వీరు చికిత్స ద్వారా గాయాలకు చికిత్స కూడా చేస్తారు. మసాజ్ థెరపిస్ట్ సగటు వార్షిక జీతం $55,310 (సుమారు రూ. 48 లక్షలు).