Nokia Layoffs: మొబైల్ ఫోన్ల ప్రపంచంలో ఒకప్పుడు తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలిన ఫిన్లాండ్ టెక్ దిగ్గజం నోకియా, ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను పునర్నిర్మించుకునే క్రమంలో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వ్యయ నియంత్రణే లక్ష్యంగా చేపట్టిన ఈ భారీ లేఆఫ్స్ ప్రభావం భారతీయ టెక్ నిపుణులపై కూడా గట్టిగానే పడనుంది.
వ్యాపార వ్యూహాల్లో భాగంగా నోకియా తన భారత నాయకత్వ బృందంలో కీలక మార్పులు చేపట్టింది. ఏప్రిల్ 1 నుండి సమర్ మిట్టల్ ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్‌గా, విభ మేహ్రా ఇండియా కంట్రీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు ఈ విభాగాలను నడిపించిన తరుణ్ ఛబ్రా తన పదవి నుంచి తప్పుకోవడంతో, కొత్త నాయకత్వంలోనైనా కంపెనీ మళ్ళీ పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్‌లో అమ్మకాలు భారీగా తగ్గడమే ఈ నాయకత్వ మార్పులకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా 2025 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు 15 శాతం మేర పడిపోయి 393 మిలియన్ యూరోలకు పరిమితమయ్యాయి. దీనికి అదనంగా, 2023లో క్లౌడ్, నెట్‌వర్క్ సర్వీసులను మొబైల్ నెట్‌వర్క్స్‌తో విలీనం చేయడం వల్ల ఆయా విభాగాల్లో ఒకే పనికి ఇద్దరు ఉద్యోగులు ఉండటం వంటి సమస్యలు తలెత్తాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని, సంస్థను లాభాల బాట పట్టించడమే ఈ తొలగింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గత ఎనిమిదేళ్లుగా నోకియా తన సిబ్బంది సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2018లో లక్షకు పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుతం 74,100కి చేరుకుంది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న 17,000 మంది ఉద్యోగులలో ఎంతమందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఉంటుందనేది ఆందోళన కలిగిస్తోంది. అయితే, కేవలం నోకియా మాత్రమే కాదు, దాని ప్రధాన పోటీదారు ఎరిక్సన్ కూడా గత ఏడాది వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి బడా సంస్థలు సైతం ఇప్పటికే లేఆఫ్స్ బాట పట్టాయి.
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!
టెక్ రంగంలో వస్తున్న ఈ మార్పులు ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నప్పటికీ, సంస్థలు మాత్రం సుదీర్ఘ కాలం మనుగడ సాగించాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని వాదిస్తున్నాయి. 5G నెట్‌వర్క్ విస్తరణ మందగించడం, టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న పోటీ నోకియా వంటి దిగ్గజాలను ఆత్మరక్షణలో పడేశాయి. ఈ క్లిష్ట పరిస్థితులను తట్టుకుని కొత్త నాయకత్వంలో నోకియా భారత్‌లో తన పూర్వ వైభవాన్ని ఎలా చాటుకుంటుందో వేచి చూడాలి.