స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న 25,487 ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పోస్టుల పరీక్షా షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి ప్రారంభమై మే నెలాఖరు వరకు కొనసాగుతాయి. వాస్తవానికి ఈ పరీక్షలు పాత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల కమిషన్ వాయిదా వేసింది. ఇప్పుడు సవరించిన తేదీల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విండో వివరాలు..
ఈసారి కమిషన్ అభ్యర్థుల కోసం ఒక వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు తమకు అనుకూలమైన వారంలో పరీక్ష రాసేలా ‘ప్రిఫరెన్స్ ఆఫ్ వీక్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల పరీక్షా ప్రక్రియ మరింత ఈజీ కానుంది. పరీక్షా కాలాన్ని మొత్తం నాలుగు విండోలుగా విభజించారు. మొదటి విండో ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు ఉంటుంది. రెండో విండో మే 4 నుంచి మే 9 వరకు కేటాయించారు. మే 18 నుంచి మే 23 వరకు మూడో విండోగా మే 25 నుంచి మే 30 వరకు నాలుగో విండోగా నిర్ణయించారు.
అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అధికారిక పోర్టల్‌లో తమ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వాలి. పైన పేర్కొన్న నాలుగు వారాలకు సంబంధించి తమ ప్రాధాన్యత క్రమాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థులు తమ ఆప్షన్లను నమోదు చేయడానికి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని కమిషన్ స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్‌లో మంచి ప్రాధాన్యత లభించింది. మొత్తం 25,487 ఖాళీలలో తెలుగు రాష్ట్రాలకు 1,105 పోస్టులు కేటాయించారు. తెలంగాణలో పురుషులకు 455 మహిళలకు 39 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు 564 మహిళలకు 47 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు తెలుగు భాషలో కూడా పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. ఇది గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు గొప్ప వరంగా మారనుంది.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సీఏపీఎఫ్, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు మెరిట్ ప్రాతిపదికన బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ వంటి దళాలను ఎంచుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) వైద్య పరీక్షలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
ALSO READ: Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 11: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు