స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి గాను స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ (గ్రూప్ బి, నాన్-గెజిటెడ్), గ్రేడ్ ‘డి’ (గ్రూప్ సి) ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న 731 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మే 15 లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి. విద్యా అర్హతతో పాటు అభ్యర్థులకు స్టెనోగ్రఫీలో తగిన నైపుణ్యం ఉండటం తప్పనిసరి.
వయోపరిమితి: గ్రేడ్ ‘సి’ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గ్రేడ్ ‘డి’ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వయస్సు గలవారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు లభిస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 మార్కులు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష సమయం రెండు గంటలు.
నోట్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి రెండో దశలో స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ ప్రాధాన్యతను బట్టి హిందీ లేదా ఇంగ్లిష్ భాషలో ఈ పరీక్ష రాయవచ్చు. గ్రేడ్ ‘సి’ పోస్టులకు నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ ‘డి’ పోస్టులకు నిమిషానికి 80 పదాల వేగంతో టైప్ చేయాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనంతరం తుది ఎంపికకు ముందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తుకు చివరి తేదీ మే 15 కాగా ఫీజు చెల్లించడానికి మే 16 వరకు సమయం ఇచ్చారు. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవడానికి మే 20, 21 తేదీల్లో అవకాశం కల్పిస్తారు.
ఎగ్జామ్ తేదీలు: కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జులై – ఆగస్టు 2026 నెలల్లో నిర్వహించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.nic.in/
ALSO READ: ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.9 లక్షల విలువైన బంగారం పోలీసులకు అప్పగింత