NEET PG 2025| నీట్ పీజీ 2025 పరీక్షను ఆగస్టు 3, 2025న నిర్వహించేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) అనుమతి కోరిన దరఖాస్తును సుప్రీంకోర్టు శుక్రవారం ఆమోదించింది.
జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేస్తూ, “పరీక్షను ఆగస్టు 3, 2025కు మార్చాలనే అభ్యర్థన నిజాయితీగా ఉందని మేము సంతృప్తి చెందాము,” అని చెప్పారు. “మే 30న మా ఆదేశాల ప్రకారం ఇచ్చిన సమయాన్ని పొడిగిస్తూ.. (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) ఎన్‌బీఈకి ఆగస్టు 3న పరీక్ష నిర్వహించేందుకు అనుమతిస్తున్నాము. అయితే ఇకపై మరో సారి పరీక్షా తేదిని పొడిగించేదిలేదు,” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎన్‌బీఈ దరఖాస్తు విచారణ చేసిన ధర్మాసనం.. పరీక్ష ఆలస్యం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. “రెండు నెలల సమయం ఎందుకు కావాలి?” అని జస్టిస్ పీకే మిశ్రా ప్రశ్నించారు. దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు, 450 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలంటే కనీసం 500 కేంద్రాలు అవసరమని ఎన్‌బీఈ.. కోర్టుకు తెలిపింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడం, భద్రతా ఏర్పాట్లు చేయడం, విద్యార్థులకు కేంద్రాలను ఎంచుకునే అవకాశం కల్పించడం వంటి ఏర్పాట్లకు తగిన సమయం పడుతుందని వివరించింది.
“ఆగస్టు 3 వరకు సమయం ఎందుకు?” అని జస్టిస్ మిశ్రా మరోసారి అడిగారు. “మే 30న ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటివరకు ఏం చేశారు? ఇంత ఆలస్యం అనవసరం,” అని జస్టిస్ మసీహ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌బీఈ తమ సాంకేతిక భాగస్వామి అయిన టీసీఎస్ వివరణ ఇస్తుందని చెప్పగా.. “టీసీఎస్ ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు. విద్యార్థులు చదువుతున్నారు, ప్రవేశాలు ఆలస్యమవుతాయి,” అని జస్టిస్ మసీహ్ అన్నారు.
అయినప్పటికీ.. కేంద్రం, ఎన్‌బీఈ ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించడానికి ఎక్కువ సమయం అవసరమని వాదించాయి. చివరకు, సుప్రీంకోర్టు ఈ అభ్యర్థనను అంగీకరించింది. మే 30న, సుప్రీంకోర్టు రెండు షిఫ్ట్‌లకు బదులు ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అయితే, జూన్ 15న ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించడం సాంకేతిక సమస్యల వల్ల కష్టమని చెబుతూ.. టీసీఎస్ ఆగస్టు 3న సాధ్యమైన తేదీగా సూచించిందని ఎన్‌బీఈ కోర్టుకు తెలిపింది.
Also Read: కస్టమర్లను మోసం చేసిన బ్యాంకు అధికారి.. కోట్లు దోచుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు
సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించేందుకు సమయం కల్పిస్తుంది. అయితే ఈ ఆలస్యం విద్యార్థుల ప్రవేశ ప్రక్రియపై ప్రభావం చూపవచ్చు.