Bank Official Fraud| బ్యాంకులో డబ్బు సురక్షితంగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, రాజస్థాన్‌లోని కోటాలో ఓ బ్యాంకు అధికారిణి 41 మంది ఖాతాదారుల నుంచి రూ. 4.58 కోట్లు మోసం చేసింది. ఆమె పేరు సాక్షి గుప్తా. ఆమె ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేసేది. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఆశతో ఈ మోసం చేసింది.
2020 నుంచి 2023 వరకు రెండేళ్ల పాటు సాక్షి ఈ మోసాన్ని రహస్యంగా కొనసాగించింది. బ్యాంకులో ఎవరికీ ఈ విషయం తెలియలేదు. ఆమె ‘యూజర్ ఎఫ్‌డీ’ లింక్‌ని ఉపయోగించి, 110 ఖాతాల నుంచి డబ్బును గుట్టుచప్పుడు కాకుండా కాజేసింది. ఈ డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టింది. కానీ, మార్కెట్‌లో భారీ నష్టాలు రావడంతో ఆ డబ్బును తిరిగి ఖాతాల్లో వేయలేకపోయింది.
ఈ మోసం ఒక ఖాతాదారుడు తన ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి తెలుసుకోవడానికి బ్యాంకులో వచ్చినప్పుడు బయటపడింది. ఫిబ్రవరి 18న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాక్షి గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తన సోదరి వివాహ వేడుకలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెను కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కోసం జైలుకు తరలించారు.
పక్కా ప్లానింగ్ తో మోసం
సాక్షి తన మోసాన్ని దాచడానికి ఖాతాదారుల ఫోన్ నంబర్లను మార్చేసింది. ఆమె తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఖాతాలకు లింక్ చేసి, లావాదేవీల సమాచారం ఖాతాదారులకు తెలియకుండా చేసింది. అంతేకాదు, ఓటీపీలు తన సిస్టమ్‌కు వచ్చేలా ఒక వ్యవస్థను కూడా రూపొందించింది. దీంతో ఖాతాదారులకు ఎలాంటి సమాచారం అందలేదు.
ఐసీఐసీఐ బ్యాంకు ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, బ్యాంకు వర్గాల సమాచారం ప్రకారం.. నష్టపోయిన ఖాతాదారులకు బ్యాంకు పరిహారం చెల్లిస్తుందని సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన ఓ ఖాతాదారుడు మహావీర్ ప్రసాద్, తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి బ్యాంకుకు వచ్చాడు. “సాక్షి గుప్తా రూ. 4 కోట్లు మోసం చేసిందని విన్నాను. నా డబ్బు సురక్షితంగా ఉందో లేదో చూడటానికి వచ్చాను,” అని అన్నాడు. “మా డబ్బును ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఉంచలేం, బ్యాంకులో కూడా సురక్షితం కాదు. ఇప్పుడు మేము ఏం చేయాలి?” అని ఆవేదన వ్యక్తం చేశాడు.