తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 194 పాఠశాలల్లో ఆరో తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో పాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ 194 ఆదర్శ పాఠశాలల్లో ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. దీనివల్ల ఆరో తరగతిలోనే సుమారు 19,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు పైతరగతుల్లో ఉన్న ఖాళీ సీట్లను కూడా ప్రవేశ పరీక్ష ద్వారానే నింపుతారు. ఎంపికైన విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలే కాకుండా భవిష్యత్తులో ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తారు. ముఖ్యంగా బాలికలకు ప్రత్యేక వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం..
దరఖాస్తు గడువు: జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 19వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
హాల్ టికెట్లు: ఏప్రిల్ 9వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫీజు వివరాలు: ఓసీ అభ్యర్థులు 200 రూపాయలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు 125 రూపాయలు చెల్లించాలి.
వయోపరిమితి విషయానికొస్తే.. 2026 ఆగస్టు 31 నాటికి ఆరో తరగతి విద్యార్థులకు పదేళ్లు నిండాలి. అదే విధంగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకు వరుసగా 11, 12, 13, 14 ఏళ్ల వయసు ఉండాలి. ప్రస్తుతం చదువుతున్న తరగతికి పైతరగతిలో చేరడానికి విద్యార్థులు అర్హులు.
ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. రెండు గంటల సమయం కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంటుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో తెలుగు, గణితం, ఈవీఎస్, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి 25 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. మిగిలిన తరగతులకు ఇంగ్లిష్, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు కీలకంగా మారుతాయి. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) మరో 10 శాతం సీట్లు ఉంటాయి. మెరిట్ జాబితాను మే 13న విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన మే 31 నుంచి జూన్ 5 వరకు సాగుతుంది.