తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్) నిర్వహించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు అలాగే గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో పీజీ కోర్సుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సులతో పాటు గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్.డి వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి మొత్తం 19 విభాగాల్లో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ అర్హతలను బట్టి బీఈ, బీటెక్ లేదా బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 6 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు.
పరీక్షా విధానం పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఉంటుంది. మొత్తం 120 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో కూడిన ఈ పరీక్షకు రెండు గంటల సమయం కేటాయించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో నెగటివ్ మార్కులు ఉండవు.
పరీక్షలు మే 28 నుంచి 31 వరకు వివిధ విడతల్లో జరుగుతాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు మే 19 నుంచి తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫీజు వివరాల విషయానికి వస్తే సాధారణ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1100 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ లేదా దివ్యాంగులకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయని వారి కోసం భారీ జరిమానాతో కూడిన అవకాశాలు కల్పించారు.
మే 9 నుంచి 10 వరకు అప్లికేషన్లలో తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుంది. మే 26 వరకు పదివేల రూపాయల గరిష్ట ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే వీలుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://pgecet.tgche.ac.in
ALSO READ: TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం