తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల సందడి మొదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 969 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘దోస్త్’ (TG DOST) వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఉన్నత విద్యామండలి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు, కళాశాలలను ఎంచుకునేందుకు ఆప్షన్లను నమోదు చేస్తున్నారు. తొలిరోజే విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. మొదటి రోజే సుమారు 3,804 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను పూర్తి చేశారు. ఇప్పటివరకు మొత్తం 47,036 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించుకుని తదుపరి దశకు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూహెచ్ వంటి ఏడు ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిధిలో ఈ ప్రవేశాలు జరుగుతున్నాయి. మొత్తం 4.40 లక్షలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు మే 7వ తేదీతో ముగియనుంది. వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు మే 8వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మే 14వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు.
తొలి విడతలో సీట్లు పొందని వారు లేదా మంచి కళాశాల కోసం వేచి చూసే వారి కోసం రెండో విడత ప్రక్రియను మే 15 నుంచి ప్రారంభించనున్నారు. అదేవిధంగా మూడో విడత కౌన్సెలింగ్ మే 31 నుంచి మొదలవుతుంది. ఈ మూడు విడతల ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ సీట్లు కేటాయించేలా ఉన్నత విద్యామండలి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియ వల్ల విద్యార్థులకు పారదర్శకంగా ప్రవేశాలు లభిస్తున్నాయి.
సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో తమకు కేటాయించిన కళాశాలలకు వెళ్లి నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఫీజు చెల్లింపు వంటి ప్రక్రియలు ఈ సమయంలోనే పూర్తి కావాలి. జూన్ 29 నుంచి విద్యార్థులకు కొత్త వాతావరణంపై అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. జులై 1వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు గడువులోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని తమకు ఇష్టమైన కోర్సుల్లో చేరాలని విద్యాశాఖ సూచిస్తోంది.
కీలక సమాచారం:
మొదటి విడత రిజిస్ట్రేషన్ ముగింపు: మే 7
వెబ్ ఆప్షన్ల గడువు: మే 8
తొలి విడత సీట్ల కేటాయింపు: మే 14
తరగతుల ప్రారంభం: జులై 1
ALSO READ: 827 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 4 రోజులే మాత్రమే..!