తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ కు అలర్ట్. తెలంగాణ ఉన్నత విద్యామండలి టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) ఇంజినీరింగ్ విభాగం పరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేసింది. మే 9 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే అగ్రికల్చర్ అలాగే ఫార్మసీ విభాగాల హాల్‌టికెట్లు అందుబాటులోకి రాగా తాజాగా ఇంజినీరింగ్ అభ్యర్థులకు సైతం ఈ సదుపాయం కల్పించారు.
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నంబర్ అలాగే పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లు పొందాలని అధికారులు సూచించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యామండలి ప్రకటించింది.
ఎగ్జామ్ షెడ్యూల్ వివరాలు: ఇంజినీరింగ్ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన సెషన్ అలాగే పరీక్షా కేంద్రం వివరాలను హాల్‌టికెట్‌లో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. నిర్ణీత సమయం కంటే ముందే కేంద్రానికి చేరుకోవడం తప్పనిసరి.
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం భారీగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 4, 5 తేదీల్లో జరిగే అగ్రికల్చర్ అలాగే ఫార్మా విభాగం పరీక్షల కోసం 106 కేంద్రాలను సిద్ధం చేశారు. మే 9 నుంచి 11 వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షల కోసం అత్యధికంగా 115 కేంద్రాలను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించారు.
అప్లికేషన్స్ వివరాలు:
ఈ ఏడాది ఈఏపీసెట్ పరీక్షకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 22 నాటి గణాంకాల ప్రకారం ఇంజినీరింగ్ విభాగానికి 2,10,308 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ విభాగానికి 90,569 మంది దరఖాస్తు చేశారు.
రూ.10వేల లేట్ ఫీజుతో..?
మొత్తం మీద మూడు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు రూ.10,000 ఆలస్య రుసుముతో మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు అలాగే ఫొటో తో పాటు సంతకం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లడం విధిగా పాటించాలి.
ALSO READ: డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. జీతం రూ.78,390.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ బ్రో