Thammidikunta Lake:స్వేచ్ఛ బ్యూరో: ఒకప్పుడు వర్షం వస్తే చాలు.. ఆ చుట్టుపక్కల దారులన్నీ జలమయమైపోయేవి. ముఖ్యంగా శిల్పారామం పరిసరాల్లో నడుంలోతు నీళ్లు చేరి, వాహనదారులు, స్థానికులు తీవ్ర అవస్థలు పడేవారు. కానీ, ఇప్పుడు ఆ దృశ్యాలన్నీ గతం కాబోతున్నాయి! హైడ్రా చేపట్టిన పునరుద్ధరణ చర్యలతో మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంది. పర్యాటకులను, స్థానికులను ఆకట్టుకునేలా సుందరీకరించిన ఈ చెరువు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఈ నెల 11వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువును వైభవంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు అక్కడి ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఎమ్మెల్యే గాంధీ, సీనియర్ పోలీస్ అధికారులు , హైడ్రా ప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.
వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం
పర్యటనలో భాగంగా సభా ప్రాంగణం, చెరువు చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు. చెరువులోకి శుద్ధి చేసిన నీటిని మాత్రమే తరలించేలా ఏర్పాటు చేసిన ఎస్టీపీ (STP) వ్యవస్థల తీరును కమిషనర్ సమీక్షించారు.
ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ‘ఇన్ లెట్లను సక్రమంగా అభివృద్ధి చేయడం వల్ల శిల్పారామం పరిసర ప్రాంతాలకు వరద ముప్పు పూర్తిగా తప్పిపోయింది. కొండాపూర్ పోలీస్ బెటాలియన్ వైపు నుంచి వచ్చే భారీ వరద నీరు కూడా నేరుగా చెరువులోకి చేరేలా పక్కా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.
ప్రజలకు ఆహ్లాదం.. ఆధునిక సౌకర్యాలు
చెరువు పరిసరాల్లో ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు, ఓపెన్ జిమ్ వసతులను అధికారులు పరిశీలించారు. చెరువు చుట్టూ నూతనంగా నిర్మించిన బండ్, వాకింగ్ పాత్ వేపై అధికారులతో కలిసి నడిచిన కమిషనర్ రంగనాథ్, అక్కడ నెలకొన్న ఆహ్లాదకర వాతావరణంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, హైడ్రా అదనపు కమిషనర్లు ఆర్. సుదర్శన్, డి. ఆనందకుమార్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ సంప్రీత్ సింగ్, ట్రాఫిక్ డీసీపీ రవికుమార్, అడిషనల్ డీసీపీ హనుమంత రావుతో పాటు పలువురు ఏసీపీలు పాల్గొన్నారు.
Also Read: గంటలో రూ.7.09 కోట్లు మాయం.. హైదరాబాద్ NBFC ఖాతాపై సైబర్ క్రిమినల్స్ పంజా!