తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాల సవరణకు మరోసారి అవకాశం కల్పించింది. వాస్తవానికి ఈ గడువు నేటితో ముగియాల్సి ఉండగా అభ్యర్థుల అభ్యర్థనల మేరకు ఏప్రిల్ 10 వరకు పొడిగిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సరిచేసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని స్పష్టం చేసింది. భవిష్యత్తులో గడువును మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని కమిషన్ సెక్రటరీ తేల్చి చెప్పారు.
ఈ కసరత్తు వెనుక కమిషన్ ప్రధాన లక్ష్యం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడమే. అభ్యర్థుల రికార్డుల్లో ఉన్న తప్పులను తొలగించి డేటాను పూర్తిస్థాయిలో సరిచూడడం ద్వారా భవిష్యత్తు నోటిఫికేషన్లు ఫలితాల విడుదలలో జాప్యం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in సందర్శించి తప్పుల్లేకుండా డేటాను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
నిబంధనలు ఇవే..
పాత అభ్యర్థులకు తప్పనిసరి: గతంలో రిజిస్టర్ చేసుకున్న వారందరూ ఖచ్చితంగా తమ ప్రొఫైల్ ఎడిట్ చేయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు అర్హత: ఓటీఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసిన వారు మాత్రమే రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
కొత్త రిజిస్ట్రేషన్లు: మొదటిసారి దరఖాస్తు చేసుకునే కొత్త అభ్యర్థులకు ఏప్రిల్ 10 తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
శిక్షార్హులు: ఇప్పటికే ఓటీఆర్ ఉన్న వారు మళ్లీ కొత్తగా రిజిస్టర్ చేయకూడదు. అలా చేస్తే డేటా ట్యాంపరింగ్‌గా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు.
ఎడిట్ ఆప్షన్: భవిష్యత్తులో అదనపు విద్యార్హతలు సాధిస్తే అప్లికేషన్‌లోని ‘Editable Tab’ ద్వారా ఎప్పుడైనా వివరాలు జోడించుకోవచ్చు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సాంకేతిక ఇబ్బందులు రాకముందే తమ ఓటీఆర్ వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది.
ALSO READ: AP DME: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్.. రూ.80,500 జీతం, ఇంకెందుకు ఆలస్యం