TGPSC Group-1: తెలంగాణ రాష్ట్ర గ్రూప్-1 అభ్యర్థులకు ఇది బిగ్ అలెర్ట్. గ్రూప్-1 రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కు సంబంధించి నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.
గ్రూప్-1 రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని.. ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపులో సరైన నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు తెలిపారు. దీనిపై రీసెంట్ గా విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. నియామకాలు తాత్కాలికంగా ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేందుకు మాత్రం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసినట్టు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది సింగిల్ బెంచ్ కు తెలిపారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై ఇవాళ జరగాల్సిన విచారణను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారానికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చారు.