Unemployment: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత త్వరలో రాబోయే నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీ అధికారులు మే, జూన్ మాసాల్లో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని పలుమార్లు చెప్పారు. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, వీఆర్వో, పోలీస్ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్ సర్కార్ పరీక్షలు నిర్వహించింది. అయితే.. రాబోయే నాలుగు, ఐదు నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు ఇవ్వాలనే యోచన రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగులకు అన్యాయం.. జర గుర్తించండి..
అయితే.. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన సమస్య.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడం. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచి నిరుద్యోగ యువత నోట్టలో మట్టికొట్టింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లు పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇది గిట్ల జరిగితే ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అన్యాయం చేసినట్లు అవుతుందని ప్రభుత్వం గుర్తించాలి. ఆ నిర్ణయం ఒకవేళ తీసుకుంటే ముమ్మాటికీ నిరుద్యోగ యువతకు నష్టం చేకూరుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడింది నిరుద్యోగులే. ఉద్యమం కూడా నీళ్లు-నిధులు-నియామకాల మీదనే జరిగింది. సమైక్య పాలనలోనూ తెలంగాణ నిరద్యోగులు చాలా నష్టపోయారు. నిజాం కాలంలో ముల్కీ- నాన్ ముల్కీ పోరాటం, ఇడ్లీ- సాంబర్ గో బ్యాక్, 1969 తెలంగాణ ఉద్యమం.. ఇలా తొలి దశ నుంచి మలి దశ వరకు ముఖ్యంగా ఉద్యోగాల కోసమే ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. ఆరు దశాబ్దాలు పాటు ఉద్యమంలో విద్యార్థి, నిరుద్యోగ యువత పాల్గొని ప్రాణాలను వదులుకుంది.
ఉద్యమంలో పాల్గొన్న వర్గాలలో ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయింది విద్యార్థులు, నిరుద్యోగ యువతనే అని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలి నుంచి మలి దశ ఉద్యమం వరకు స్టూడెంట్స్ క్లాసెస్‌ను బహిష్కరించి రోడ్లెక్కి ఉద్యమం కొనసాగించారు. నిరుద్యోగ యువతపై కేసులు కావడం ఒక ఎత్తు అయితే.. లక్షలాది మంది విద్యార్థులు తమ చదువులను కోల్పోయారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే కదా..? పిల్లలకు గవర్నమెంట్ కొలువులు వస్తాయనే కదా..? కానీ అప్పటికీ.. ఇప్పటికీ ఏం మారకుండా.. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం తెలంగాణ యువత ఎదురుచూస్తుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి తమ బతుకులు బాగు పడతాయని తెలంగాణ నిరుద్యోగ యువత రోడ్డపైకి వచ్చి పోరాడింది. కానీ ఇప్పుడు అన్ని వర్గాల్లో నిరుద్యోగ, విద్యార్థి వర్గమే ఎక్కువ నష్టపోయింది.
Also Read: Mallareddy: మల్లారెడ్డి ఎక్కడ..? ఒకప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. ఇప్పుడు ఏమైంది..?
ఓ శ్రీకాంతా చారి.. కానిస్టేబుల్ కిష్టయ్య, యాది రెడ్డి ఇలా ఎంతో మంది యువత రాష్ట్రం కోసం, ఉద్యోగాల కోసం తమ ప్రాణాలను వదలుకున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి.. ప్రభుత్వం అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల పేరుతో నిరుద్యోగులను తక్కువ చేయకుండా.. జాబ్ క్యాలెండర్ విడుచేయాలనే నిరుద్యోగులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే ఇతరేత్రా ఇబ్బందులతో ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 63 ఏళ్లకు పెంపుపై ప్రభుత్వానికి ఏమైనా ఆలోచనా ఉంటే వెంటనే విరమించుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై జరుగుతోన్న ప్రచారం వెంటరే రేవంత్ సర్కార్ స్పందించాలని నిరుద్యోగులు మొరపెట్టుకుంటున్నారు.