Jagadish Reddy: శాసన సభ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయన సస్పెండ్ కు గురయ్యారు. సస్సెండ్ అయిన అభ్యర్థిని బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు.
ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు. సభ్యుల అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్ వ్యవహరించాలని చెప్పారు. ఈ సభ మీ సొంతం కాదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారని స్పీకర్ ఆక్షేపించారు.
అయితే శాసన సభ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సస్పెన్షన్ పై బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. స్పీకర్ ను కించపరిచేలా మాట్లాడలేదని.. స్పీకర్ విలువ ఏంటో తనకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. సభలో గవర్నర్ ప్రసంగంలో తప్పులు ఎత్తిచూపే ప్రయత్నం చేశానని, బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో ఉంటే తమ బండారం బయటపడుతుందని కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్ర ఇదని ఓ రేంజ్ లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
సభ అందరిది, సభలో అందరికీ హక్కులు ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశానని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కావాలంటే మరోసారి రికార్డులు చెక్ చేసుకోవాలని చెప్పారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకవచనంతో వ్యాఖ్యానించలేదని చెప్పారు. స్పష్టమైన కారణం లేకుండా తనపై కక్షగట్టి, కుట్ర చేసి సభ నుంచి బయటికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ కేసీఆర్ పోట్లాడి తెలంగాణను సాధించారని.. ఎన్నోసార్లు సభల నుంచి ఆయనను బయటికి పంపించారని.. చివరకి ఆ ఒక్కరే తెలంగాణను సాధించి చూపించారని గుర్తు చేశారు. తనను బయటికి పంపినంత మాత్రాన తన గొంతు నొక్కలేరని.. ఇంకా బలంగా ప్రజల సమస్యలను ఎత్తి చూపుతానని ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువే చూశామని.. తమకు ఇవేమి కొత్త కాదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వెల్లడించారు.