అఘోరీమాత కొద్దిరోజులుగా తెలంగాణలో మారుమోగిపోతున్న పేరు. ఇదివరకు కేవలం అఘోరాలు మాత్రమే ఉంటారని అందరికీ తెలుసు కానీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన తరవాత అఘోరీమాత అక్కడకు వచ్చి ప్రత్యక్షమైంది. తాను సనాతనధర్మ రక్షణ కోసమే బయటకు వచ్చానని, ఇది వరకు కొన్నేళ్లపాటు హిమాలయాల్లో ఉన్నానని చెప్పింది. అఘోరీ అంటే చేతిలో కర్ర తప్ప ఏమీ ఉండవు..కానీ అఘోరీమాత మాత్రం ఐఫోన్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్ లో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో మీడియా మొత్తం కొద్దిరోజులుగా మాత చుట్టే తిరుగుతుంది.
యూట్యూబ్‌లో అఘోరీమాత వీడియోలు ట్రెండింగ్‌లో ఉండటంతో యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఆమె ఎక్కడికి వెళితే అక్కడి వెళుతున్నాయి. ఈ క్రమంలో అఘోరీమాత తాను సికింద్రాబాద్ టెంపుల్ వద్ద ఈ నెల 1న ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడం మరో సెన్సేషన్. దీంతో రెండు మూడు రోజులుగా అఘోరీమాత ఆత్మార్పణమే హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆలయం వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమ స్వగ్రామం అయిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కుశ్నపల్లికి తరలించారు.
రెండు రోజులుగా ఆమెను పోలీసులు వారి ఇంటివద్దనే భారీ భద్రత ఏర్పాటు చేసి ఎక్కడకూ వెళ్లకుండా రక్షణ కల్పించారు. గ్రామంలో సైతం ఆంక్షలు విధించి ఎవరూ గ్రామానికి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇక తాజాగా అఘోరీమాత తల్లి దండ్రులు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వద్దకు వెళ్లి ఆయనను కలిశారు. తమ కూతురును కాపాడాలని వేడుకున్నారు. దీంతో ఆయన ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో అఘోరీమాత ఆత్మర్పణంపై వెనక్కి తగట్టినట్టు తెలుస్తోంది. కార్తీకమాసం కావడంతో తాను కేరళ, కర్నాటకలోని ఆలయాలను సందర్శించి వస్తానని చెప్పగా బెల్లంపల్లి పోలీసులు, జగిత్యాల పోలీసులు కలిసి ఆమెను కర్నాటక బార్డర్ వైపు తరలించినట్టు తెలుస్తోంది. ఇక ఆలయాల సందర్శన తరవాత తిరిగి తాను తెలంగాణకు వస్తానని, ఇక్కడే ఉంటానని అఘోరీమాత చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అఘోరీమాత ఎపిసోడ్ కు ఇప్పటికి బ్రేక్ పడింది.