Alternate platforms for Twitter: ట్విట్టర్ ని కొన్న టెస్లా కార్ల కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్… ఎన్నో మార్పులు చేపట్టారు. రోజుకు 32 కోట్లకుపైగా నష్టాన్ని తగ్గించుకోడానికి అంటూ ప్రక్షాళన మొదలు పెట్టారు. కంపెనీలోని 7500 మంది ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించుకునే పనిలో పడ్డారు. వస్తూవస్తూనే బోర్డు డైరెక్టర్లను కూడా సాగనంపారు మస్క్. ఆదాయం పెంచుకోడానికి బ్లూటిక్ వెరిఫికేషన్ పేరుతో నెలకు 8 డాలర్ల ఫీజు నిర్ణయించారు. ఇక ఎవరైనా ప్రొఫైల్ లో పేరు మార్చకున్నా, ఫొటోలు మార్చుకున్నా వేటు తప్పదని హెచ్చరించారు. చివరికి కామెడీ నటి కాథీపై వేటు వేశారు. మస్క్ దూకుడు నిర్ణయాలు నచ్చని చాలామంది ట్విట్టర్ కు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయ ప్లాట్ ఫాంల వైపు షిఫ్ట్ అవుతున్నారు. అలాంటివారిని ఆకర్షిస్తున్నాయి మాస్టడోన్, బ్లూస్కై సోషల్, కూ, టంబ్లర్, కౌంటర్ సోషల్, క్లబ్ హౌజ్, రెడిట్, కోహోస్ట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు.
మాస్టడోన్ అనే ఓపెన్ సోర్స్ మైక్రోబ్లాంగ్ సర్వీస్ పాతదే. 2016లో యూజెన్ రోఖో దీన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లు ఇన్నాళ్లు దాదాపు 6.5 లక్షల మంది యూజర్లు ఉండేవారు. ట్విట్టర్ యూజర్లు షిఫ్ట్ కావడం మొదలయ్యాక… వారం రోజుల్లోనే దాదాపు 3 లక్షల మంది వరకు యూజర్లు పెరిగారు. ముఖ్యంగా సెలబ్రిటీలు దీని వైపు మళ్లుతున్నారు.
ట్విట్టర్ యూజర్లు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న మరో సోషల్ మీడియా ప్లాట్ ఫాం… బ్లూస్కై సోషల్. 2019లో దీన్ని ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ప్రారంభించారు. రెండు రోజుల్లోనే దీనిలో దాదాపు 30 వేల మంది యూజర్లు చేరారు.
వీళ్లంతా ట్విట్టర్ నుంచి వచ్చినవారేనంటున్నారు.
ఇక భారత్ లో పుట్టిన కూ యాప్ కు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. 2019లో కరోనా టైంలో తెరమీదకు వచ్చిన ఈ యాప్ కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 50 మిలియన్లు అంటే 5 కోట్లకుపైగా యూజర్లు డౌన్ లోడ్లు చేసుకున్నారు. మొత్తం 10 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ను ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.
ఇక బ్లాగ్ ను తలపించే టంబ్లర్, మరో మైక్రోబ్లాగింగ్ సైట్ కౌంటర్ సోషల్, ఆడియో ఆధారిత యాప్ క్లబ్ హౌజ్, ట్విట్టర్ కు భిన్నంగా ఉండే రెడిట్, బీటా వర్షన్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన కోహోస్ట్ వంటివి ఎన్నింటినో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం ట్విట్టర్ ఫీజు పెట్టడంతో చాలామంది ఇతర సైట్లకు షిఫ్ట్ అవుతున్నారు.