India and England : T20 వరల్డ్ కప్ కు ముందు ఇండియా, ఇంగ్లండ్ జట్లకు గాయాల టెన్షన్ పట్టుకుంది. ప్రాక్టీస్ చేస్తూ కోహ్లీ, రోహిత్ గాయపడ్డారన్న వార్త విని భారత అభిమానులు ఆందోళన చెందుతుంటే… ఇప్పటికే గాయం కారణంగా ఓ స్టార్ బ్యాటర్ ను దూరం చేసుకున్న ఇంగ్లండ్… ఇప్పుడో స్టార్ బౌలర్ కూడా మ్యాచ్ కు దూరం అవుతాడేమోనని ఆందోళన చెందుతోంది.
నిన్న నెట్స్ లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తుండగా… ఓ బంతి అతని ముంజేతికి బలంగా తగలడంతో నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో చికిత్స అందించినా… ఆ తర్వాత ఒక బంతి మాత్రమే ఆడిన హిట్ మ్యాన్… చేయి నొప్పి తగ్గకపోవడంతో గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికీ… ఇంగ్లండ్ తో మ్యాచ్ లో నొప్పి తిరగబెట్టి సరిగ్గా ఆడలేకపోతే ఎలా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇక తాజాగా కోహ్లీ కూడా నెట్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడనే సమాచారంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లి గాయపడ్డాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నా… ఎక్కడ గాయమైంది? దాని తీవ్రత ఎలా ఉంది? ఇంగ్లండ్ తో సెమీస్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న విషయాలు తెలియక అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కీలకమైన సెమీ ఫైట్ కు ముందు ఈ గాయాల బెడద ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. సెమీస్ కు ముందు ఇంగ్లండ్ కు కూడా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గాయం కారణంగా డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఇప్పుడు స్టార్ పేసర్ మార్క్ ఉడ్ కూడా జనరల్ స్టిఫ్‌నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే ప్రాక్టీస్‌కు కూడా ఉడ్ దూరంగా ఉన్నాడని చెబుతున్నారు. అతని సమస్య అంత పెద్దది కాకపోయినా… టీమిండియాతో మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్‌గా ఉంటాడా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఉడ్… సెమీస్ కు దూరమైతే కచ్చితంగా జట్టు విజయావకాశాలపై ప్రభావం పడుతుందని బట్లర్ టీమ్ టెన్షన్ పడుతోంది. ఒకవేళ ఉడ్ కోలుకోకపోతే… అతని స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిల్స్‌కు తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.