Almonds:శనగలను పేదవాళ్ల బాదంగా పిలుస్తారు. వీటిల్లో చాలా పోషకాలు ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఫుడ్‌తో సమానంగా పోషకాలు ఉండడమే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతాయి. మన శరీరానికి పోషకాలు సరిగా అందినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది కాస్త అనారోగ్యానికి గురైతే బలం కోసం బాదం, పిస్తా తింటారు. కిలో బాదం దాదాపుగా రూ.800 వరకు ఉంటుంది. కేవలం ధనవంతులకు మాత్రమే బాదం పప్పు అందుబాటులో ఉంటుంది, పేదలకు ఇది అందని ద్రాక్షే అని చెప్పవచ్చు. బాదం కంటే ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి. వాటిలో శనగలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. నాన్‌వెజ్‌తో సమానంగా పోషకాలు శనగల్లో ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఫాబేసి వర్గానికి చెందిన శనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శనగల్లో నాటీ శనగలు, కాబూలీ శనగలు అనే రెండు రకాలు ఉంటాయి. కొన్ని తెల్లగా ఉంటే, మరికొన్ని పచ్చగా, ఇంకా డార్క్ బ్రౌన్ కలర్‌లో కూడా ఉంటాయి. ఈ శనగలు నానబెట్టి మొలకలు వచ్చాక తిన్నా, వేయించుకుని, ఉడకపెట్టుకుని తింటే ఆరోగ్యకరం. శనగల చాట్ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది. శనగల్లో కాల్షియం, విటమిన్ బీ, సీ,ఏ,ఈ,కే, మెగ్నీషియం, ఫాలేట్, ఫాస్పరస్, సెలీనియం, ఫైబర్, ఐరన్‌లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతాయి. కాల్షియం లోపంతో బాధపడేవారికి ఇవి మంచి ఆహారంగా చెప్పవచ్చు. శనగల వల్ల మన శరీరానికి ఇందులోని ఐరన్, ప్రొటీన్, మినరల్స్ ఎనర్జీని అందించి అలసట, నీరసాన్ని తగ్గిస్తాయి. శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా రక్తంలో చెడు కొలస్ట్రాల్ తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా అధిక బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. షుగర్ ఉన్నవారు గుప్పెడు నానబెట్టిన శనగలు రోజూ తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని పీచు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది, ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతాయి.