Pregnant Women : ఈరోజుల్లో చికిత్స అందించడానికి మాత్రమే కాదు.. వ్యాధులను కనిపెట్టే విషయంలో కూడా టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు మనిషికి వచ్చిన వ్యాధి ఏంటో త్వరగా డయాగ్నైస్ చేయగలిగితే.. దానికి తగిన చికిత్స కూడా వెంటనే ఇవ్వవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ఈ విభాగంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ మెరుగైన రిజల్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి పరిశోధన ఒకటి సక్సెస్ అయ్యింది.
ఫిలిప్పిన్స్ వైద్యులు.. వ్యాధులను త్వరగా కనిపెట్టడం కోసం ఒక టెలీమెడిసిన్ పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరం కేవలం బీపీ, ఛాతి నొప్పి మాత్రమే కాకుండా.. ప్రెగ్నెంట్ మహిళల్లో కలిగే ఆరోగ్య మార్పులు, పిల్లల హార్ట్‌బీట్‌ను గమనించడానికి కూడా ఉపయోగపడతాయని వారు చెప్తున్నారు. ఫిలిప్పిన్స్‌లోని ఒక చిన్న గ్రామమైన బటౌన్ టౌన్‌లోని రూరల్ హెల్త్ యూనిట్‌లో పనిచేసే వైద్యులు ఈ పరిశోధన చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది. వారు కనిపెట్టిన ఈ టెలీమెడిసిన్ పరికరానికి ఆర్ఎక్స్ బాక్స్ అని పేరుపెట్టారు.
దాదాపు ఒక ఏడాది నుండి ఆర్ఎక్స్ బాక్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. కేవలం ప్రెగ్నెంట్ మహిళల విషయంలో మాత్రమే కాకుండా తరచుగా ఛాతి నొప్పితో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడానికి కూడా ఈ ఆర్ఎక్స్ బాక్స్ ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు. ఆండ్రాయిడ్‌తో పనిచేసే ఈ బాక్స్.. మెడికల్ పరికారలకు కనెక్ట్ చేసి ఉపయోగించే విధంగా ఉంటుందని వారు అన్నారు. అంతే కాకుండా పేషెంట్ల ఆరోగ్య సమాచారాన్ని ఇతర వైద్యులకు పంపడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
ఛాతినొప్పి అధికంగా ఉన్నవారిని వేరే హాస్పిటల్‌కు పంపేముందు ఈ ఆర్ఎక్స్ బాక్స్.. వారి ఆరోగ్య పరిస్థితిని రికార్డ్ చేసుకుంటుందని, దీని వల్ల అత్యవసర చికిత్స అవసరమా కాదా తెలుస్తుందని వైద్యులు చెప్తున్నారు. గర్భవతుల విషయంలో కూడా వారు ఇదే ప్రక్రియ ఫాలో అవుతామన్నారు. ఇలాగే ఎంతోమంది గర్భవతులను ప్రాణహాని నుండి కాపాడగలిగామన్నారు. ఈసీజీతో ఉన్న ఆర్ఎక్స్ బాక్స్.. ఛాతినొప్పి ఉన్న పేషెంట్లను స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఇలాంటి మరెన్నో టెక్నికల్ పరికరాలు వైద్యరంగంలో ఉపయోగపడతాయని వైద్యులు చెప్తున్నారు.