Hydra : హైదరాబాద్ మహా నగరంలో చెరువులు, కుంటలతో పాటు గొలుసుకట్టు కాలువల రక్షణ కోసం ఆవిర్భవించిన హైడ్రాకు(Hydra) సంబంధించి కమిషనర్ రంగనాథ్ కీలక విషయాల్ని వెల్లడించారు. సామాజిక మాధ్యమాలను అడ్డుగా పెట్టుకుని లేనిపోని అసత్యాలు ప్రసారం చేయడంతో పాటు హైడ్రా పనితీరుపై విమర్శలు చేస్తున్న తరుణంలో కమిషనర్ స్పందించారు. హైడ్రా ఎలాంటి కట్టడాలను కూల్చనుందో, ఎలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండనుందో తెలుపుతూ వివరణ విడుదల చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆలోచనల్లో పురుడుపోసుకున్న హైడ్రా భాగ్యనగర చరిత్రలో కీలకంగా నిలిచిపోనుంది. తరాలుగా ఇక్కడి ప్రజలకు మంచినీరుతో పాటు ఇతర అవసరాలకు పుష్కలంగా నీళ్లు అందిస్తున్న ఇక్కడి వనరులు దారుణంగా ఆక్రమిస్తున్న తరుణంలో.. వాటికి పునరుజ్జీవనాన్ని కలిపించేందుకు హైడ్రా రూపుదిద్దుకుంది. సీఎం ప్రత్యేక ఆదేశాలు, చొరవతో జూలై 2024న హైడ్రా అనే స్వయం అధికార వ్యవస్థ రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి భాగ్యనగరంలోని చెరువుల్లోని(lakes) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. అయితే.. ఈ విభాగం ఇప్పటి నుంచి మరింత స్పష్టమైన కార్యచరణతో పనిచేయనున్నట్లు తెలిపింది.
హైడ్రా సాధారణ ప్రజల నివాసాల విషయంలో ఉదారంగా వ్యవహరించనుందని తెలిపిన రంగనాథ్.. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉన్నా సరే వాటి జోలికి వెళ్లమని ప్రకటించారు. ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ (Google Earth), క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే.. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా FTL పరిధిలో ఉంటే కూల్చేస్తామని ప్రకటించారు.
గతంలో అనుమతులు ఇచ్చి తరువాత వాటిని రద్దు చేస్తే.. ఆ కట్టడాలు సైతం అక్రమ కట్టడాల జాబితాలోకి వస్తాయని తెలిపారు. అవి నివాసాలు అయినా సరే జులై తర్వాత నిర్మాణం జరిగి ఉండే కూల్చివేతలు తప్పనిసరి అన్నారు. కత్వా చెరువు , మల్లంపేట, అమీన్ పూర్ లో కూల్చివేత లు ఈ విభాగంలోనివే అని స్పష్టం చేశారు .
నగరంలో చాలా మంది పేదలను ముందు పెట్టి వెనుక నుంచి ప్రభుత్వ భూములు, చెరువుల్ని కబ్జా చేస్తున్నారని అన్న హైడ్రా కమిషనర్.. అలాంటి వాటి విషయంలో హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. ఉదాహదరణకు చింతల చెరువు, గాజులరామారం, మాదాపూర్ లోని సున్నం చెరువులో ఈ తరహా కబ్జాలను గుర్తించినట్లు తెలిపారు. ఇవి కాకుండా.. కోర్టు ఆదేశాల మేరకు మరికొన్ని నిర్మాణాలను తొలగిస్తామని ప్రకటించారు. నిజాంపేట్ లోని ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ అలా కూల్చివేసినవే అని ప్రకటించారు.
గతంలో ఉన్న నిర్మాణాల విషయంలో అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపిన హైడ్రా కమిషనర్.. జులై 2024 తర్వాత నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. అనుమతి ఉన్నా, లేకున్నా FTL పరిధిలో వుంటే కూల్చివేస్తామని ప్రకటించారు. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యుల్ని చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఎఫ్ టీఎస్ పరిధిలో అనుమతి లేకుండా ఉన్న కమర్షియల్ కట్టడాలను వదిలే ప్రసక్తే లేదని తెలిపిన హైడ్రా కమిషనర్.. హైదరాబాద్ లో చెరువుల FTL మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని.. త్వరలోనే అన్ని చెరువుల ఎఫ్ టీఎస్ పరిధి నిర్థరణ పూర్తవుతుందని ప్రకటించారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ప్రస్తుతం 12 చెరువుల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపిన కమిషనర్ రంగనాథ్.. ఆ చెరువుల పునరుద్దరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం. చెరువులు, పార్కులతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందని, ఇలాంటి సంస్థ దేశంలోనే మొట్ట మొదటిదని అన్నారు. గత 5 నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తోందని. ఏమన్నా లోటు పాట్లు ఉంటే వాటిని సవరించుకుని మరింత దృఢంగా, నిబద్ధతతో పని చేయనున్నట్లు ప్రకటించారు.
భావితరాల భవిష్యత్ బాగుండాలని, పర్యావరణ హితమైన, మెరుగైన ప్రజా జీవనం కోసం నగర ప్రజలు హైడ్రా కు సహకరిస్తున్నారని కమిషనర్ రంగనాథ్ హార్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు హైడ్రా పని చేస్తుందని అన్నారు. హైడ్రాను బలోపేతం చేయడానికి వివిధ చట్టాల కింద ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెడుతూ వస్తోందని, టెక్నాలజీ పరంగా కూడా మరింత బలపడుతున్నట్లు రంగనాథ్ ప్రకటించారు.
Also Read : ఇకపై భూ భారతి.. బంగాళాఖాతంలోకి ధరణి, చెప్పినట్టే చేసిన రేవంత్ ప్రభుత్వం
గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుందని తెలిపిన రంగనాథ్.. ప్రజలు పెద్ద ఎత్తున హైడ్రా పై నమ్మకం తో ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు హైడ్రా ప్రజల నుంచి వచ్చిన 5,000 లకు పైగా ఫిర్యాదులను పరిష్కరించిందని తెలిపారు. ఇంకా పలు ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్… భూ కబ్జాల వెనక ఉన్న పాత్ర దారులు, సూత్రధారుల మీద చట్ట పరంగా కఠిన చర్యల తీసుకోనున్నట్లు తెలిపారు.