BigTV English

Bhu Bharati: ఇకపై భూ భారతి.. బంగాళాఖాతంలోకి ధరణి, చెప్పినట్టే చేసిన రేవంత్ ప్రభుత్వం 

Bhu Bharati: ఇకపై భూ భారతి.. బంగాళాఖాతంలోకి ధరణి, చెప్పినట్టే చేసిన రేవంత్ ప్రభుత్వం 

⦿ భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం


⦿ అసెంబ్లీ ముందుకు భూభారతి 2024 ఆర్వోఆర్ చ‌ట్టం

⦿ సామాన్యుల భూ హక్కుల పరిరక్షణే ధ్యేయం


⦿ ధరణితో ఉన్న సమస్యలు పోక.. కొత్త తలనొప్పులు

⦿ అన్ని సమస్యలకు కొత్త చట్టంతో చెక్

⦿ ఆర్వోఆర్ 2020 పూర్తి ప్ర‌క్షాళ‌న

⦿ కొత్త చట్టం అవసరాన్ని వివరించిన మంత్రి పొంగులేటి

⦿ ధరణితో ఏర్పడిన సమస్యలపై వివరణ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: తెలంగాణ‌లో సామాన్యుల భూహ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ భూభార‌తి చ‌ట్టాన్ని రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. బుధ‌వారం శాస‌న‌స‌భ‌లో మంత్రి భూభార‌తి బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఇటువంటి అద్భుత‌ చ‌ట్టాన్ని ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం త‌న‌కు ల‌భించ‌డం మ‌ర‌చిపోలేని విష‌య‌మ‌ని అన్నారు. 1971లో నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఆర్వోఆర్ చ‌ట్టం 49 ఏళ్ల‌పాటు ఉప‌యోగ‌ప‌డింద‌ని, ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ఏడేళ్ల పాటు కూడా ప్ర‌జోప‌యోగంగా ఉంద‌ని వివరించారు. అర్ధ‌రాత్రి నాలుగు గోడ‌ల న‌డుమ రూపొందిన ధ‌ర‌ణి చ‌ట్టం వ‌ల‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోగా ల‌క్ష‌లాది కొత్త స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టింద‌ని చెప్పారు.

రాష్ట్రమంతా అభిప్రాయ సేకరణ

కొండ‌నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్న‌ట్లు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో లెక్క‌లేన‌న్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. లోక్‌స‌భ‌లో ప్ర‌తిపక్ష‌ నేత రాహుల్ గాంధీ, నాటి ప్ర‌తి ప‌క్ష‌నేత, నేటి ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌మ పాద‌యాత్ర‌ల సంద‌ర్బంగా ధ‌ర‌ణిని అరేబియా సముద్రంలో క‌లుపుతామ‌ని ఇచ్చిన హామీని ప్ర‌జ‌లు విశ్వ‌సించార‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆమేర‌కు ఇందిర‌మ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నార‌ని, ఒక్క గుంట భూమి ఉన్న వారు కూడా త‌మ‌ను న‌మ్మార‌ని, వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టేందుకు ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసి భూభార‌తిని రూపొందించామ‌ని చెప్పారు. ఆగ‌స్టు 2న తాము ముసాయిదాను ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మేగాక ప్ర‌త్యేకంగా 40 రోజుల పాటు వెబ్ సైట్‌లో పెట్టి ప్ర‌జాప్ర‌తినిధులు, క‌వులు, మేధావులు, విశ్రాంత అధికారుల స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీకరించి కొత్త చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేశామ‌ని వివరించారు. మాజీ మంత్రి హ‌రీష్ రావు 7 పేజీలు, వినోద్‌ రావు 5 పేజీల స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశార‌ని వాటిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని తెలిపారు. 33 జిల్లాల్లో ఒక్కోరోజు ప్ర‌త్యేక చ‌ర్చా వేదిక‌లు నిర్వ‌హించి అంద‌రి అభిప్రాయాలు తీసుకున్నామ‌ని చెప్పారు. 18 రాష్ట్రాల‌లోని ఆర్వోఆర్‌ల‌ను అధ్య‌య‌నం చేసి, ఉత్త‌మ విధానాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి వాటిని భూభార‌తిలో పొందుప‌రిచామ‌ని చెప్పారు మంత్రి.

ధరణితో దగాపడ్డ బతుకులు 

ధ‌ర‌ణ కార‌ణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా సతమతమయ్యారు. ఉదాహరణగా కొన్ని ఘటనలను వివరించారు మంత్రి పొంగులేటి. ‘‘కేస‌ముద్రం మండ‌లం నారాయ‌ణ‌పురంలో కె ర‌వి అనే ఎంపీటీసీ స‌భ్యులు భూ స‌మ‌స్య‌ల‌ను బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పెద్ద‌లంద‌రి దృష్టికి తీసుకువెళ్లారు. కానీ, ఏళ్ల త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాలేదు. స‌ర్వే నెంబ‌ర్లు 149, 150, 154, 156, 168 త‌దిత‌రాల్లోని 1398 ఎక‌రాల భూమి త‌ర‌త‌రాలుగా అక్క‌డి గిరిజ‌నుల సాగుబ‌డిలో ఉన్నాయి. ధ‌ర‌ణి 2020 ఆర్వోఆర్ చ‌ట్టం వ‌చ్చాక వారి హ‌క్కుల‌కు భంగం వాటిల్లేలా స‌ద‌రు భూములు అట‌వీ భూముల‌ని తేల్చి చెప్పారు. దీంతో గిరిజ‌నులు తీవ్ర మ‌నోవేద‌న‌న‌కు గురయ్యారు. గ‌త ప్రభుత్వ హ‌యాంలో 4 నెల‌ల పాటు రిజిస్ట్రేష‌న్లు ఆపివేశారు. దీంతో భూములు అమ్ముకొని కుటుంబంలో పెళ్లిళ్లు, చ‌దువుల కోసం ఖర్చు చేద్దామ‌నుకొనే సామాన్య రైతుల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగింది’’ అని వివరించారు. భూభారతి బిల్లుకు సంబంధించి 22 – 23 సార్లు అభిప్రాయాలు తీసుకున్నామ‌ని, అందువ‌ల్లే బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డంలో జాప్యం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌జల‌కు పూర్తిస్ధాయిలో ఉప‌యోగ‌ప‌డేలా బిల్లు త‌యారుచేసేందుకు కృషి చేశామ‌ని, సాదాసీదా బిల్లును ప్ర‌జ‌ల‌పై రుద్దే ఆలోచ‌న త‌మ ప్ర‌భుత్వానికి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

1971 తర్వాత మళ్లీ ఇప్పుడే 

భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి, భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది. ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం. భూమిని నమ్ముకుని బతికే కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ, కేసీఆర్ ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1971లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్టం 49 ఏండ్లు విజయవంతంగా అమలైంది. ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ లాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. కానీ, వేలాది పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ 2020 ఆర్వోఆర్ చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో మూడేండ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి.

మానవ సంబంధాలను సైతం దెబ్బ తీసిన ధరణి 

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావాల్సినవి కోర్టుల దాకా వెళ్ళాల్సి వచ్చింది. నాలుగు గోడల మధ్య కూర్చుని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా జనం నెత్తిమీద రుద్దారు. ధరణి  మానవ సంబంధాలను సైతం దెబ్బతీసింది. మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ళకింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదనను చెప్పుకోడానికీ మార్గం లేకుండా చేసింది. అందుకే  రాహుల్‌ గాంధీ ఎన్నికల సమయంలో ధరణిని అరేబియా సముద్రంలో వేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని తెలంగాణ ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో, సహచర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు భూ భారతిని తీసుకొస్తున్నామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు 

ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి సూచన మేరకు ధరణి కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అనేకసార్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రెవెన్యూ చట్టాలను ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఆనాటి దొరలు గడీల్లో కూర్చుని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్టు బిల్లును ఇదే అసెంబ్లీలో ఆగస్టు 2న ప్రవేశపెట్టామని తెలిపారు పొంగులేటి. ప్రజల నుంచి చట్టం రావాలనే ఉద్దేశంతో అదే రోజున సీసీఎల్ఏ వెబ్‌సైట్‌లో కూడా ముసాయిదా బిల్లును అందుబాటులో ఉంచామని, దాదాపు పాతిక రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, రైతుసంఘాల ప్రతినిధులు, మేధావులు, సామాన్య ప్రజానీకం, రిటైర్డ్ అధికారుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించామన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను స్వీకరించారని, చివరకు 2020 చట్టంలో ప్రధాన పాత్ర పోషించిన హరీశ్‌ రావు, వినోద్ కుమార్ సూచనలు కూడా స్వీకరించామని తెలిపారు. ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని, ప్రజాస్వామ్యబద్ధంగా సభలో భూ భారతి బిల్లును ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.

ప్రధానాంశాలు 

⦿ గత చట్టం (2020)లోని తప్పులను అధ్యయనం చేసి భూ భారతి ద్వారా సరిదిద్దడం

పార్టు బీ లో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం

గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు పరిష్కారం

భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం

⦿ రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ (అథారిటీ)ని ఏర్పాటు.

ధరణితో కొంత వరకే పని.. ఇప్పుడలా కాదు 

⦿ ధరణిలో రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు ఉండేది. తప్పులకు పరిష్కారం చూపే వ్యవస్థే లేదు. ఇప్పుడు అలా ఉండదు.

⦿సేల్ డీడ్, వారసత్వం కాక కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38 ఈ తదితర మొత్తం 14 రకాల భూ హక్కులపై మ్యుటేషన్ పవర్స్ ఆర్డీవో చేతిలో.

⦿ సాదా బైనామా – 2020 నవంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన సుమారు 9.24 లక్షల దరఖాస్తులకు పరిష్కారం.

⦿ దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకూ భూధార్ నెంబర్ ఇస్తారు.

⦿ జమాబందీ, గ్రామ రెవెన్యూ రికార్డులు – 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అదే విధంగా కొనసాగిస్తారు. త్వరలోనే ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది.

⦿ భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ళ కోసం లాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు. అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి సంఖ్యపై ప్రభుత్వ నిర్ణయం. 124 రెవెన్యూ చట్టాలకు అనుగుణంగా న్యాయం పొందే వెసులుబాటు.

⦿ ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్‌ను కొత్త చట్టంలో పొందుపరిచారు.

⦿ ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు.

 అనుభవదారుడు / ఖాస్తు కాలం

⦿ 2014కి ముందు పాస్ బుక్కులు కలిగి ఉండి అనుభవదారుడిగా పొసిషన్‌లో ఉన్నవారు ధరణి తరువాత రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది.

⦿ భూ భారతిలో పట్టాదారులు, అనుభవదారులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ చట్టం వారికి సముచిత స్థానం కల్పిస్తుంది.

మాన్యువల్ రికార్డుల భద్రత

⦿ రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తారు.

 భూ భారతి ప్రత్యేకతలు 

⦿ ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదించారు.

⦿ గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేశారు.

⦿ గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌ప్లే చేస్తారు.

⦿ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ఎవరైనా భూ భారతి ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందించారు.

⦿ భూ భారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్‌డేట్స్ వెళ్ళే సౌకర్యాన్ని కల్పించారు.

⦿ గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూ భారతి ద్వారా బట్టబయలు చేస్తారు.

⦿ 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తారు.

⦿ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదలరు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతారు.

⦿ గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత మూడేండ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయి. ఆ తప్పుల్ని ప్రజలపై బలవంతంగా రుద్దారు. ఇప్పుడు అలా జరగకుండా మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు మంత్రి, ప్రజా ప్రతినిధులు కలిసి పరిష్కారం.

⦿ గత ప్రభుత్వం మాటలతో మభ్య పెట్టింది. ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇద్దరు వ్యక్తులు 2020 ఆర్వోఆర్ చీకటి చట్టాన్ని ప్రజలపై రుద్దారు. పూర్తి అవినీతితో నిండిపోయిన ఈ చట్టం మూడేండ్లకే నూరేండ్లు నిండిపోయేలా ప్రజలే మార్గనిర్దేశం చేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం కనీసం వందేళ్ళు వర్ధిల్లుతుందని ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది.

ధరణితో ఏర్పడిన సమస్యలెన్నో 

ధరణి వల్ల సామాన్యులకు నష్టమే తప్ప ఉపయోగం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లు గడిచినా సమస్యల పరిష్కారం కాక, సతమతం అయినవారు ఎందరో. ఇది పెద్దవాళ్ల కోసమే ఏర్పాటైదన్న విమర్శలు వచ్చాయి. కోర్టులు సైతం ధరణి సమస్యలపై ప్రశ్నించిన సందర్భాలున్నాయి.

⦿ నిర్ణీత సమయంలో ఈ – పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ జరగలేదు

⦿ డేటా సవరణ కోసం చేసుకున్న ఆన్ లైన్ అర్జీల పరిష్కారం ఆలస్యం

⦿ సర్వే కోసం ఎఫ్ లైన్ దరఖాస్తు పెట్టుకున్న పట్టించుకోలేదు

⦿ కారణం లేకుండానే ఆన్ లైన్/ఎఫ్ లైన్ దరఖాస్తుల తిరస్కరణ

⦿ సెక్షన్ 7కు లిమిటేషన్ పీరియడ్ వివరంగా చెప్పలేదు

⦿ అమ్మకం, కొగోలు లావాదేవీలను సకాలంలో పూర్తి చేయడానికి ధరణిలో అప్‌లోడ్ చేసిన జనరల్, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలను పట్టించుకోలేదు

⦿ సెక్షన్ 7లో పేర్కొన్న కోర్టు డిక్రీ అనే దానిలో స్పష్టత ఇవ్వలేదు

⦿ కోర్టు కేసుల్లో వివాదంలో ఉన్న భూమి మాత్రమే కాకుండా, సర్వే నెంబర్లన్నీ నిషేధిత జాబితాలో చేర్చారు

⦿ పొరబాటున ఏదైనా సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో చేరినా, ప్రభుత్వ భూమి అని మారినా, దానిని మార్చడానికి ధరణిలో ఆప్షన్ లేదు

⦿ భూ సమస్య రిజెక్ట్ అయితే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు

⦿ ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూముల వివరాలు కూడా ధరణిలో లేవు. ఇలా ఎన్నో సమస్యలు ధరణితో పుట్టుకొచ్చాయి.

Also Read: గుంతల రోడ్లపై చర్చ.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రూ. 700 కోట్లతో రోడ్డు

ధరణి వల్ల వివాదాల్లో చిక్కుకున్న భూముల వివరాలు 

సమస్య – భూమి(ఎకరాల్లో)

కారణాలు లేకుండా ఉన్న భూమి – 5,07,000 ఎకరాలు

ఆధార్ ఇవ్వనివి – 2,59,515 ఎకరాలు

నాలా పూర్తయి వివాదంలోని భూమి – 1,38,130 ఎకరాలు

అమ్మినట్టు చూపుతున్న భూమి – 1,37,400 ఎకరాలు

సాదాబైనామా – 1,04,850 ఎకరాలు

ప్రభుత్వ భూమి – 93,300 ఎకరాలు

అక్రమంగా బదలాయించినవి – 78,540 ఎకరాలు

సర్వే నెంబర్లలో విస్తీర్త తేడాలు – 49,300 ఎకరాలు

సివిల్ కోర్టు కేసులు – 34,750 ఎకరాలు

ఫారెస్ట్(రెవెన్యూ రికార్డుల్లో) – 34,600 ఎకరాలు

రెవెన్యూ కోర్టు కేసులు – 27,880 ఎకరాలు

ఫారెస్ట్ సరిహద్దు వివాదాలు – 21,600 ఎకరాలు

ఎండోమెంట్ – 15,994 ఎకరాలు

ఇనాం కింద సెటిల్ కానివి – 14,610 ఎకరాలు

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×