డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతున్నదో, సైబర్ నేరాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. స్కామర్లు కొత్త కొత్త పద్దతుల ద్వారా ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను కొట్టేస్తున్నారు. ఇప్పటి వరకు మెసేజ్ లింకుల ద్వారా డేటా హ్యాక్ చేసిన దుండగులు ఇప్పుడు, మోబైల్ ఛార్జర్ కేబుల్ ద్వారా ఫోన్ లోని పూర్తి సమాచారన్ని దొంగిలిస్తున్నారు. ఇకపై అపరిచిత వ్యక్తుల సెల్ ఫోన్ ఛార్జర్లను ఉపయోగించకూడదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఛార్జర్ కేబుల్ తో డేటా ఎలా కొట్టేస్తారు?
తాజాగా ప్రముఖ సోషల్ మీడియ ఇన్ ఫ్లూయెన్సర్, ఎథికల్ హ్యాకర్ ర్యాన్ మోంట్ గోమెరీ రీసెంట్ గా ఓ వీడియోను షేర్ చేశారు. ఛార్జింగ్ కేబుల్స్ ద్వారా డేటాను ఎలా దొంగిలించే అవకాశం ఉంది? అనే విషయాలను ఇందులో వివరించారు. ఇప్పటి వరకు చాలా మంది ఛార్జింగ్ కేబుల్ ద్వారా ఎలాంటి హాని కలగదని భావిస్తారని, కానీ, దానితోనూ ముప్పు తప్పదని హెచ్చరించారు. మోంట్ గోమేరీ సాధారణంగా కనిపించే ఓ కేబుల్ ను కంప్యూటర్ లోకి ప్లగ్ చేశాడు. అది కేవలం ఛార్జింగ్ కేబుల్ గా కనిపించినప్పటికీ, మోబైల్ లోని పూర్తి డేటాను యాక్సెస్ చేయగలిగింది. మోంట్ గోమేరీ తన ఫోన్ ద్వారా కంప్యూటర్ ను కంట్రోల్ చేశారు. సో, అపరిచిత వ్యక్తులకు సంబంధించి ఛార్జింగ్ కేబుల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని హెచ్చరించారు. ఛార్జింగ్ కేబుల్ ద్వారా మాల్వేర్ ను ఫోన్ లోకి పంపించే అవకాశం ఉందన్నారు. ఈ మాల్వేర్, మీ ఫోన్ డేటా అంతటినీ దొంగిలిస్తుందని చెప్పారు. అంతేకాదు, మీ ఫోన్ ను మాల్వేర్ సాయంతో హ్యాకర్లు కంప్లీట్ గా తమ ఆధీనంలోకి తీసుకుంటారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
తెలియని ఛార్జర్లతో జాగ్రత్త
ఎయిర్ పోర్టులు, షాపింగ్ మాల్స్ లో కనిపించే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ చేసుకునే సమయంలో ఎక్కువగా హ్యాకింగ్ కు గురవుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు USB ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించడం మానుకోవాలని సూచిస్తున్నారు. మీ ఫోన్ లోని డేటా దొంగతనం జరగకుండా USB డేటా బ్లాకర్ ని ఉపయోగించాలంటున్నారు. ఇది మీ ఫోన్ ఛార్జ్ చేయడానికి అనుమతించేటప్పుడు డేటాను ట్రాన్స్ ఫర్ కాకుండా అడ్డుకుంటుంది. మీ ఫోన్ హ్యాకింగ్ కు గురి కాకుండా ఉండేందుకు వీలైనంత వరకు సొంత ఫోన్ ఛార్జర్ ను ఉపయోగించాలంటున్నారు. తెలియని వ్యక్తుల సెల్ ఫోన్ ఛార్జర్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోకూడదంటున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితులలో ఇతరుల కేబుల్ తో ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకుంటే కచ్చితంగా USB డేటా బ్లాకర్ ని ఉపయోగించాలంటున్నారు. అప్పుడే సైడర్ నేరగాళ్ల బారి నుంచి మీ పర్సనల్ డేటా సురక్షితంగా ఉంచుకునే అవకాశం ఉందంటున్నారు. మీ ఫ్రెండ్స్ తో పాటు శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని చెప్పాలంటున్నారు.
Read Also: మీ పాన్ నెంబర్ ను ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేస్తారో తెలుసా? జాగ్రత్త.. లేకపోతే!