Chandrayaan-3 : చంద్రయాన్-3 ప్రయోగంపై లేటెస్ట్ అప్ డేట్స్ ను ఇస్రో వెల్లడించింది. జాబిల్లిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ పనిని ముమ్మరం చేశాయి. చంద్రుడి ఉపరితలంపై రోవర్ చక్కర్లు కొడుతోంది. ఇక ల్యాండర్‌లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్-చాస్టే అప్‌డేట్స్ అందించడం మొదలు పెట్టింది.
తాజాగా చంద్రుడిపై ఉష్ణోగ్రతల వివరాలను పంపించింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల ప్రొఫైల్ ఎలా ఉందనే డీటెయిల్స్ రికార్డ్ చేసింది. ఉపతర నుంచి 10 సెంటీ మీటర్ల లోతు వరకు టెంపరేచర్ వివరాలను 10 సెన్సార్ల ద్వారా నమోదు చేసి… ఆ వివరాలు ఇస్రోకు పంపించింది.
చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మారుతూ ఉన్న క్రమాన్ని ప్రత్యేకమైన గ్రాఫ్ రూపంలో ఇస్రో వెల్లడించింది. ఈ వివరాలపై ట్వీట్ చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉష్ణోగ్రతలు నమోదు చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఈ ఘనత కూడా ఇస్రోకే దక్కింది. జాబిల్లిపై మరింత లోతుగా అధ్యయనం కొనసాగుతోందని ఇస్రో పేర్కొంది.