Affordable Electric Cars In India: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు తోడుగా, వాహనదారులలో పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా కొత్త కొత్త కార్లు మార్కెట్లోకి వస్తుండటంతో పెట్రో కార్లకు స్వస్తి పలుకుతున్నారు. భారత్ లో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లు ఏవి? వాటి రేంజ్ ఎంత? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.
భారత్ లో అత్యంత సరసమైన 7 ఎలక్ట్రిక్ కార్లు:
⦿ MG కామెట్ ఈవీ
MG మోటార్ ఇండియా తీసుకొచ్చిన మూడు డోర్ల అర్బన్ కారు MG కామెట్ ఈవీ. MG కంపెనీ నుంచి MG ZS EV వచ్చిన రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ కారు 25-kWh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. 50 kW మోటార్ ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ ఈ కారు 200 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధర సుమారు రూ. 8 లక్షలు ఉంటుంది. భారత్ లో అత్యంత తక్కువ ధరతో లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే.
⦿ టాటా టియాగో ఈవీ
టాటా కంపెనీ నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ. ఈ కారు నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. 19.2-kWh, 24-kWh బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంది. తొలి వేరియంట్ 250 కి.మీ, రెండో వేరియంట్ 315 కి.మీ రేంజ్ అందిస్తున్నది. ఈ కారులోని మోటార్ 74bhpని కలిగి ఉంటుంది. 114nm టార్క్ ను అందిస్తుంది. దీని ధర ఆయా వేరియంట్ ను బట్టి రూ.8.69 లక్షల నుంచి రూ. 11.99 లక్షల వరకు ఉంటుంది.
⦿ టాటా పంచ్ ఈవీ
ఈ ఏడాది జనవరిలో టాటా పంచ్ మైక్రో SUVకి సంబంధించి ఆల్ ఎలక్ట్రిక్ మోడల్ ను టాటా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ఈవీ పోర్టుపోలియోలో పూర్తి Acti.ev ప్లాట్ ఫారమ్ లో రూపొందించింది. ఈ కారు కూడా రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటిలో ఒకటి 25 kWh, 35 kWh వేరియంట్ కాగా, మరొకటి 35 kWh వేరియంట్. ఈ కారు అత్యధికంగా 421 కి. మీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు సింగిల్ పేన్ సన్ రూఫ్ ను కలిగి ఉంటుంది. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్ లను ఏర్పాటు చేశారు. దీని ధర రూ. 10.99 లక్షల నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంటుంది.
⦿ సిట్రోయెన్ ఈసీ3
ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టిన తొలి ఫ్రెంచ్ ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ ఈసీ3. అంతేకాదు, ఇది తొలి ఎక్ట్రిక్ సబ్ కాంపాక్ట్ SUV కావడం విశేషం. ఈ కారు మోటార్ 57 పీఎస్ పవర్, 143 nm టార్క్ ను అందిస్తుంది. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ కారు ఒక్క ఛార్జ్ తో 350 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర 12.76 లక్షల నుంచి 13.56 లక్షలు ఉంటుంది.
⦿ టాటా టిగోర్ ఈవీ
తక్కువ ధరలో లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారు ఏకంగా 5 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారులో 74 bhp పవర్ మోటార్ ను అమర్చారు. గరిష్టంగా 170 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 26 kwh లిథియం అయాన్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ కారు ధర రూ. 12.49 లక్షల నుంచి 13.75 లక్షలుగా ఉంటుంది.
⦿ టాటా నెక్సాన్ ఈవీ
ఈ ఎలక్ట్రిక్ కారుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే తొలి హై వోల్టేజ్ ఇండియన్ కారు ఇదే. అంతేకాదు. అత్యధికంగా అమ్ముడు అవుతున్న కారు కూడా ఇదే ఈ కారు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు 30.2 kwh బ్యాటరీని కలిగి ఉంటుంది. 129 ps పవర్, 245 nm టార్క్ ను అందిస్తుంది. ఒక్క ఛార్జ్ తో 312 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ.14.49 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 10 సెకెన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
⦿ మహీంద్రా XUV400
ఈ కారు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. 34.5 kWh, 39.5 kWh బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 150 PS ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంది. ఒక్క ఛార్జ్ తో 456 కి .మీ రేంజ్ అందిస్తుంది. రక్షణ కోసం ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉంది. దీని ధర రూ. 15.49 లక్షల నుంచి 19.39 లక్షల వరకు ఉంటుంది.