Micro Electric Car : భారత రోడ్లపై దూసుకెళ్లేందుకు సిద్ధమైందో బుల్లి కారు. అది కూడా ఎలక్ట్రిక్ వెర్షన్. లుక్ లో టాటా నానోను… షేపులో మారుతి రిట్జ్ ను తలపిస్తున్న ఈ మైక్రో కార్లో… కేవలం రెండు సీట్లే ఉండటం విశేషం. ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు వీలుగా దీన్ని సిద్ధం చేశారు.
ముంబైకి చెందిన PMV ఎలక్ట్రిక్ సంస్థ… ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. దీని పేరు EaS-E. 4 నుంచి 5 లక్షల రూపాయల ధరలో ఈ బుల్లి కారును బుధవారం లాంచ్ చేస్తోంది… PMV ఎలక్ట్రిక్ సంస్థ. ఇండియాలో ఆ కంపెనీ తొలి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ మైక్రో కార్ ఇదే.
EaS-E ఎలక్ట్రిక్ కార్ ను మూడు వేరియంట్‌లలో, 10 రంగుల్లో లాంచ్ చేస్తున్నారు. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్‌కోల్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, రాయల్ లైట్ బ్రౌన్, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్ రంగుల్లో ఈ కారు అందుబాటులోకి రానుంది. ఈ వెహికల్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని… దీని కోసం 3 కిలోవాట్ ఏసీ ఛార్జర్‌ని ఇస్తున్నామని చెబుతోంది.
EaS-E ఎలక్ట్రిక్ కారులో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మొత్తం బరువు 550 కేజీలు కాగా… 2,915 ఎంఎం పొడవు… 1,157 ఎంఎం వెడల్పు, 1,600 ఎంఎం ఎత్తు ఉంది. ఇక వీల్‌బేస్ 2,087 మిల్లీమీటర్లు కాగా… గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎంగా ఉందని చెబుతున్నారు.