KCR : తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట లేనట్టే. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై నేతలతో చర్చించారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజల్లోకి వెళ్లండి..
ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలను మార్చాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. అధికారం మళ్లీ దక్కుతుందనే విశ్వాసాన్ని కేసీఆర్ ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు.
బీజేపీపై ఎదురుదాడి
బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మునుగోడు తరహాలో పటిష్ఠ ఎన్నికల వ్యూహం తయారు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో చట్టం తన పని తాను చేస్తోందన్నారు. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరాలని బీజేపీ ఒత్తిడి చేసిందని పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు.