Ola Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అడుగు పెడుతూనే సంచలనం సృష్టించిన ఓలా… వినియోగదారులను ఆకట్టుకునేలా ఇప్పుడు మరో ఎట్రాక్టివ్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 80 వేల రూపాయలకే కొత్త స్కూటర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ మూడు రోజులే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
S సిరీస్ లో S1, S1ప్రొ పేరుతో రెండు స్కూటర్లు విడుదల చేసిన ఓలా… ఇప్పుడు S1 Air పేరుతో రూ.79,999కి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అదే బైక్ కావాలంటే రూ.85 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తక్కువ ధరలో లభ్యమవుతున్న స్కూటర్లకు పోటీగా… ఓలా ఈ స్కూటర్ ను లాంచ్ చేసింది.
S1 Airకు సంబంధించిన వివరాల్ని కూడా ఓలా ప్రకటించింది. తక్కువ బరువుతో డిజైన్ చేసిన ఈబైక్ ను పుల్ గా చార్జ్ చేస్తే… 101 కిలోమీటర్ల దూరం వెళ్తుందని ఓలా చెబుతోంది. ఎకో మోడ్ లో మాత్రమే 101 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. నార్మల్, స్పోర్ట్స్ మోడ్ లో బండి నడిపితే… 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించే ఛాన్స్ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ గా చార్జ్ కావాలంటే 4.3 గంటలు ఛార్జింగ్ పెట్టాలి. ఇక S1 Air టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. 4.3 సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని ఓలా పేర్కొంది. ఇక స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే… జీపీఎస్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటు 17.78 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ పొందుపరిచారు. సీటు కింది భాగంలో 34 లీటర్ల బూట్‌స్పేస్ ఉంటుంది. ఐదు రంగుల్లో వస్తున్న ఈ బైక్ ను ఓలా ఎలక్ట్రిక్ యాప్ లేదా… ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ నుంచి రూ.999 చెల్లించి రూ.80 వేల ధరకు బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పూర్తి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. స్కూటర్ల డెలివరీ ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తారు.