T20 World Cup 2022 : T20 వరల్డ్ కప్ లో సూపర్ 12 రెండో మ్యాచ్ లో ఆప్ఘనిస్తాన్ పై ఇంగ్లండ్ సూనాయాసంగా గెలిచింది. ఆప్ఘన్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్… ఆ తర్వాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్… ఆరంభం నుంచే ఆప్ఘన్ బ్యాటర్లను కట్టడి చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్ లో ధాటిగా పరుగులు తీయలేకపోయిన ఆప్ఘన్ బ్యాటర్లు… వికెట్లను కూడా క్రమంగా కోల్పోయారు. ఆ జట్టులో మిడిలార్డర్ ఆటగాళ్లు ఇబ్రహీం, ఉస్మాన్ ఘని మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించేలా ఆడారు. ఇబ్రహీం 32 పరుగులు చేయగా, ఘని 30 రన్స్ చేశాడు. ఆప్ఘన్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ కాగా… నలుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా చేయలేదు. చివరికి 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది… ఆప్ఘన్ టీమ్. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 5 వికెట్లు తీయగా… బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ రెండేసి వికెట్లు తీశారు. మరో వికెట్ క్రిస్ ఓక్స్ కు దక్కింది.
113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాటర్లు… చాలా కూల్ గా ఆడారు. దూకుడుగా బ్యాటింగ్ చేయకుండా ఆచితూచి పరుగులు తీస్తూ వెళ్లారు. 35 రన్స్ దగ్గర తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్… 52 రన్స్ దగ్గర రెండో వికెట్, 65 రన్స్ దగ్గర మూడో వికెట్ కోల్పోయింది. 81 పరుగుల దగ్గర నాలుగో వికెట్, 97 రన్స్ దగ్గర ఐదో వికెట్ పడ్డాయి. ఆ జట్టు బ్యాటర్లలో లివింగ్ స్టోన్ దే టాప్ స్కోర్. 21 బంతుల్లో 29 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు… లివింగ్ స్టోన్. 18.1 ఓవర్లలో 113 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది… ఇంగ్లండ్. ఐదు వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శామ్ కరన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.