RBI Raises Repo Rate:2022లో ఐదు సార్లు రెపో రేటును పెంచిన ఆర్బీఐ… కొత్త ఏడాదిలోనూ దాన్ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. 6.25 శాతం నుంచి 6.5 శాతానికి చేర్చింది. దీంతో… గృహ, వాహన, గోల్డ్, వ్యక్తిగత రుణాల మీద బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు మరింత పెరిగి… చెల్లింపులు కూడా పెరగబోతున్నాయి. ఏడాది వ్యవధిలోనే ఆరుసార్లు రెపో రేటు పెరగడంతో… ఈఎంఐల భారం పెరిగిపోయి సామాన్యులంతా సతమతమవుతున్నారు. పెరిగిన కిస్తీల్ని చెల్లించేందుకు, తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చుల్లో కోత పెడుతున్నారు.
నిరుడు మే నెల వరకు రెపో రేటు 4.4 శాతం మాత్రమే ఉండేది. దాంతో గృహ రుణాలను బ్యాంకులు 7 శాతానికి అటూ ఇటుగా ఇచ్చేవి. ఇప్పుడు రెపో రేటు ఏకంగా 2.1 శాతం పెరిగి… 6.5 శాతానికి చేరింది. దాంతో బ్యాంకులు కూడా గృహ రుణాలపై 9 శాతానికి పైగానే వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఏడాది కిందట ఓ వ్యక్తి ఇంటి కొనుగోలు కోసం… 20 ఏళ్ల కాలవ్యవధికి 7 శాతం వడ్డీతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే… ఈఎంఐ రూ.38,765గా ఉండేది. 2022లో ఆర్బీఐ ఏకంగా 5 సార్లు రెపోరేటు పెంచి… దాన్ని 6.25కు చేర్చింది. ఆ మేరకు బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను 1.85 శాతం పెంచాయి. అంటే రూ.50 లక్షల రుణంపై 7 శాతంగా ఉన్న వడ్డీ రేటు కాస్తా 8.85 శాతానికి చేరింది. ఆ లెక్కన ఈఎంఐ రూ.5,740 రూపాయలు పెరిగి, రూ.44,505కు చేరింది. తాజా పెంపుతో వడ్డీ రేటు 8.85 శాతం నుంచి 9.1 శాతానికి చేరుతుంది. అంటే ఈఎంఐ రూ.803 పెరిగి… 45,308కి చేరుతుంది. అంటే, 20 ఏళ్ల కాలవ్యవధికి తీసుకున్న రూ.50 లక్షల గృహ రుణంపై ఈఎంఐ భారం ఏడాది వ్యవధిలో రూ.6,543 పెరిగిందన్న మాట. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ భారం రూ.78,516. గృహ రుణాలే కాదు.. కార్, టూవీలర్, గోల్డ్, వ్యక్తిగత రుణాలపై చెల్లించే ఈఎంఐల భారం కూడా ఇకపై పెరిగిపోనుంది.