Social media apps : సోషల్ మీడియా యాప్స్ మధ్య పోటీ అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఎవరైతే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తూ.. యాప్స్‌ను అప్డేట్ చేస్తుంటారో వారిదే ఫస్ట్ ప్లేస్. అందుకే సోషల్ మీడియా యాప్స్ అని నువ్వా నేనా అన్నట్టుగా అప్డేట్స్‌ను మార్కెట్లోకి దింపుతున్నాయి. టెక్సాస్ అధినేత ఎలన్ మస్క్.. ట్విటర్‌కు సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోషల్ మీడియా మధ్య పోటీ మరో కొత్త రూపంలోకి మారింది.
ఎలన్ మస్క్ ట్విటర్ సీఈఓ అయిన తర్వాత బ్లూ టిక్స్ విషయంలో, సబ్‌స్క్రిప్షన్స్ విషయంలో కొత్త కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాడు. ముందుగా ఈ మార్పులకు యూజర్లు.. ట్విటర్‌ను ట్రోల్ చేసినా ఆ తర్వాత వారు ఆ మార్పులకు అలవాటుపడ్డారు. ఇప్పుడు ఇదే ప్లాన్‌ను మెటా కూడా ఫాలో అవ్వాలని అనుకుంటోంది. మెటా ప్రపంచంలో ఉన్న సోషల్ మీడియా యాప్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. కూడా పెయిడ్ సర్వీసులను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తోంది. ముందుగా యూకేలో ఈ సర్వీసులను ప్రారంభించింది.
మెటా ప్రారంభించిన ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్.. దాదాపుగా ట్విటర్ బ్లూ లాగానే ఉందని పలువురు యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ట్విటర్ బ్లూ అనేది నెలకు 9.99 యూరోలు తీసుకొని ట్విటర్ యూజర్లకు బ్లూ టిక్‌ను అందించింది. ఇప్పుడు మెటా కూడా దాదాపుగా అలాంటి సౌకర్యాన్నే అందించనుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మెటా వెరిఫైడ్‌లో సైన్ అప్ అయ్యి వెరిఫైడ్ యూజర్లుగా మారపోవచ్చు. ఈ సర్వీసును వినియోగించుకోవాలంటే ముందుగా యూజర్లు 18 ఏళ్లకు పైబడి ఉండాలి.
మెటా పెయిడ్ సర్వీసును వినియోగించుకోవాలంటే ముందుగా వారు ఇచ్చిన అధికారిక ఐడీని ఉపయోగించాలి. మామూలు యూజర్ల కంటే పెయిడ్ సర్వీసును ఉపయోగించే యూజర్లకు సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ క్రమంలో ఫేక్ అకౌంట్స్‌ను యాజమాన్యం గుర్తుపట్టి.. యూజర్లను వాటి నుండి కాపాడుతుందని అన్నారు. ఈ పెయిడ్ సర్వీస్‌లో ఫేక్ ఐడీలకు అసలు ఛాన్స్ లేదన్నారు. ట్విటర్ బ్లూ లాగానే మెటా సర్వీస్ కూడా నెలకు 9.99 యూరోలు ఛార్జ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు నెలకు 11.99 యూరోలు ఛార్జ్ చేస్తుందని తెలిపారు.