E-Paper
Advertisement

Panchayat Elections Live Updates: పల్లె పోరులో హస్తం హవా.. పంచాయతీ పోరులో సత్తా చాటిన ట్రాన్స్‌జెండర్..

Panchayat Elections Live Updates: పల్లె పోరులో హస్తం హవా.. పంచాయతీ పోరులో సత్తా చాటిన ట్రాన్స్‌జెండర్..

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సొంత ఊర్లో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ విజయం

మహబూబాబాద్ జిల్లాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కురవి మండలంలోని ఆమె స్వగ్రామమైన ‘పెద్ద తండా’లో బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి సొంత గ్రామంలోనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి జ్యోతి నరేందర్ విజయం సాధించారు. సత్యవతి రాథోడ్ సొంత గడ్డపైనే బీఆర్ఎస్ ఓడిపోవడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విజయంతో పెద్ద తండాలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ప్రభంజనం.. 118 స్థానాల్లో జయకేతనం

మహబూబాబాద్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీయడంతో ఆ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందారు. మొత్తం 169 స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 118 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక వామపక్షాల విషయానికి వస్తే.. సీపీఎం 1, సీపీఐ ఎంఎల్  1 స్థానంలో విజయం సాధించాయి. స్వతంత్రులు/ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు.

ములుగులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. డీలా పడ్డ బీఆర్ఎస్

ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వెలువడ్డాయి. జిల్లాలోని మొత్తం 46 స్థానాలకు గాను ఫలితాలు విడుదల కాగా, అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఏకంగా 30 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమై డీలా పడింది. ఇక్కడ స్వతంత్రులు/ఇతరులు చెప్పుకోదగ్గ స్థాయిలో 7 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.

ఉమ్మడి మెదక్ జిల్లా ఫలితాల సరళి: సంగారెడ్డిలో కాంగ్రెస్ హవా.. సిద్దిపేట, మెదక్‌లో హోరాహోరీ

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. మొత్తం 183 స్థానాలకు గాను ఇప్పటివరకు 138 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో విజయం సాధించి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీఆర్ఎస్ 58 స్థానాలతో గట్టి పోటీనిస్తోంది. ఇక్కడ బీజేపీ 6 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందారు.

సిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లాలో ఫలితాలు అత్యంత ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇక్కడ ఇరు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. మొత్తం 163 స్థానాలకు గాను 129 ఫలితాలు వెలువడగా.. కాంగ్రెస్ 62 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌కు దీటుగా నిలిచింది. బీజేపీ కేవలం 3 స్థానాలకు, స్వతంత్రులు 8 స్థానాలకు పరిమితమయ్యారు.

సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడ ఏకపక్ష విజయాలతో దూసుకుపోతోంది. మొత్తం 234 స్థానాలకు గాను 191 ఫలితాలు వెలువడగా, కాంగ్రెస్ ఏకంగా 132 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ పార్టీ 52 స్థానాలకే పరిమితమై వెనుకబడిపోయింది. బీజేపీ ఇక్కడ నామమాత్రంగా 2 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు.

ఆదిలాబాద్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రాళ్ల దాడిలో ఎస్ఐకి గాయం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా సీతగొంది కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి హింసాత్మకంగా మారింది. కేంద్రం వద్ద గుమిగూడిన జనాలను ఎస్ఐ పురుషోత్తం చెదరగొట్టే ప్రయత్నం చేయగా, పరుగులు తీసే క్రమంలో ఒక వ్యక్తి గోడ దూకుతూ కిందపడిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్ఐ పురుషోత్తం తలకు తీవ్ర గాయమైంది. ఆందోళనకారులు అక్కడితో ఆగకుండా పోలీస్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో సీతగొందిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయపడిన ఎస్ఐని ఆసుపత్రికి తరలించారు.

పంచాయతీ పోరులో సత్తా చాటిన ట్రాన్స్‌జెండర్.. వార్డు మెంబర్‌గా నందిని ఘన విజయం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకూ సముచిత స్థానం ఉందని నిరూపిస్తూ చారకొండ మండలంలో ఓ ట్రాన్స్‌జెండర్ ఎన్నికల్లో సత్తా చాటారు. చారకొండ మండలంలోని 11వ వార్డు మెంబర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నందిని విజయం సాధించారు. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 64 ఓట్ల మెజారిటీతో నందిని గెలుపొందారు.

విజయం అనంతరం నందిని మాట్లాడుతూ.. తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఉద్వేగంగా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్లకు తగిన గౌరవం దక్కుతోందని, ఉద్యోగాలు కల్పించి తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని కొనియాడారు. కేవలం ఉద్యోగాలే కాకుండా రాజకీయాల్లోనూ తాము రాణించగలమనే నమ్మకాన్ని సీఎం కల్పించారని, వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నందిని పేర్కొన్నారు.

నాగల్ గిద్దలో హైడ్రామా.. టాస్‌కు నో చెప్పిన అభ్యర్థులు, కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద (మం) శాంతినగర్ తండాలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో ఉత్కంఠ భరిత సన్నివేశం చోటుచేసుకుంది. నాగల్ గిద్ద మండలం శాంతినగర్ తండా గ్రామ పంచాయతీ ఫలితం టైగా ముగిసింది. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులిద్దరికీ సమాన సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం టాస్ (Toss) లేదా లక్కీ డ్రా (Lucky Draw) పద్ధతిని పాటించాలని సూచించారు.

అయితే, ఇందుకు ఇరువురు అభ్యర్థులు ససేమిరా అంగీకరించలేదు. తమకు టాస్ పద్ధతి వద్దంటూ భీష్మించుకు కూర్చున్నారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గకపోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల ఆందోళనతో అక్కడ హైడ్రామా నడుస్తోంది. పోలీసులు, అధికారులు అభ్యర్థులను శాంతింపజేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఉమ్మడి వరంగల్‌లో కాంగ్రెస్ జోరు.. జనగామలో బీఆర్ఎస్ పోటీ

 తెలంగాణలో జరుగుతున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. జిల్లాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే.. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. ఇక్కడ కాంగ్రెస్ 33 స్థానాల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ 7 స్థానాలకే పరిమితమైంది. హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ 10 స్థానాల్లో ,బీజేపీ 1 స్థానంలో విజయం సాధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ 28 స్థానాలను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 8 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 2, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. అయితే, జనగామ జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తూ ముందంజలో ఉంది. జనగామలో బీఆర్ఎస్ 19 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించింది.

వరికోల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రోడ్డుపై కాంగ్రెస్ శ్రేణుల బైఠాయింపు

హనుమకొండ జిల్లా నడికుడ మండలం వరికోల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల ఏజెంట్లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కౌంటింగ్‌ను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు.

సిద్దిపేట

  • చేర్యాల (మం) కాశ గుడిసెల గ్రామంలో BRS పార్టీ బలపర్చిన అభ్యర్థి ఆసియా బేగం గెలుపు
  • అక్కన్నపేట (మం) మల్చేర్ తండలో BRS బలపర్చిన అభ్యర్థి మహేందర్ గెలుపు

ములుగు జిల్లా

  • వాజేడు మండలం దూలపురం పంచాయితీ సర్పంచ్ గా యాలం విజయలక్ష్మి (కాంగ్రెస్) అభ్యర్థి గెలుపు

మహబూబాబాద్ జిల్లా

  • మరిపెడ మండలం బాలినే ధర్మారం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్ధి బండ జ్యోతి గెలుపు..
  • మరిపెడ మండలం ఎల్లారిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా శాంతి మల్సూర్ బీఆర్ ఎస్ గెలుపు..
  • మరిపెడ మండలం బోటియ తండా కాంగ్రెస్ అభ్యర్థి విజయ కౌసర్ గెలుపు..

సంగారెడ్డి

  • నాగల్ గిద్ద (మం) శ్యామా నాయక్ తండాలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మారుతి 63 ఓట్ల తేడాతో గెలుపు
  • నిజాంపేట (మం) మొదలుకుంట తండాలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి దేవ చందర్ 8 ఓట్లతో గెలుపు
  • నాగలిగిడ్డ (మం)కూబా తండాలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి రాజు జాదవ్ గెలుపు
  • నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ లో బిఆర్ ఎస్ బలపరచిన అభ్యర్థిని విజయం 157 ఓట్ల తో గెలుపు.
  • మనూర్ (మం) కమలాపూర్ గ్రామంలో 3 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి రమేష్ గెలుపు

రిజర్వేషన్ల రగడ.. ఏన్కూర్ మండలంలోని ఆ 4 గ్రామాల్లో ఆగిన పంచాయతీ ఎన్నికలు

 ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొనగా, ఏన్కూర్ మండలంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా అంతటా పోలింగ్ ముగిసి, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. మండలంలోని ఏన్కూర్, అరికలపాడు, నాచారం, జెన్నారం గ్రామాల్లో మాత్రం ఎన్నికల సందడి కనిపించడం లేదు. ఈ నాలుగు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పంచాయతీలు ఏర్పడిన నాటి నుంచి ఎస్టీ (ST) వర్గానికే రిజర్వ్ అవుతూ వస్తుండటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్, ఇతర వర్గాల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. రిజర్వేషన్ రొటేషన్ పద్ధతి పాటించడం లేదని, తమకు ఒక్కసారి కూడా పోటీ చేసే అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్టే (Stay) విధించడంతో.. మిగిలిన జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, ఈ నాలుగు గ్రామాల్లో మాత్రం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

పెద్దపల్లిలో ముగిసిన మూడో విడత పోలింగ్.. కౌంటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు

పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో గ్రామ పంచాయతీ మూడో విడత పోలింగ్ గడువు ముగిసింది. సాయంత్రం సమయం పూర్తికావడంతో అధికారులు పోలింగ్ కేంద్రాల గేట్లు మూసివేశారు. పోలింగ్ సమయం ముగిశాక వచ్చిన ఓటర్లు ఓటు వేయలేక నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. అయితే, సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన కేంద్రాల్లో అధికారులు బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి, వాటిని భద్రంగా కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×