E-Paper
Advertisement

Top 20 News Today: రాజకీయాల నుంచి రిటైర్.. ఒంగోలు ఎంపీ, డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్

Top 20 News Today: రాజకీయాల నుంచి రిటైర్.. ఒంగోలు ఎంపీ, డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్

1. అదుపుతప్పి బోల్తా పడిన తుఫాన్ వాహనం

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న తుఫాన్ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా 10మందికి గాయాలయ్యాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

2. మంత్రి సత్యప్రసాద్ ఆరోపణలు

తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో సూత్రధారి, పాత్రధారి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డినేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అతి త్వరలో విచారణ నివేదిక వస్తుందని, నిందితులు ఎవరో తెలిసిపోతుందని అన్నారు. దేవుడి సొమ్ము దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడేందుకు రాజీ చేయడం చరిత్రలో లేదని అన్నారు మంత్రి అనగాని. భూమన అబద్ధాలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

3. రాజకీయాల నుంచి రిటైర్.. ఒంగోలు ఎంపీ

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై మరోసారి స్పందించారు. త్వరలో తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకున్నా, తాను ప్రజా సేవలో మాత్రం కొనసాగుతానని ఎంపీ పేర్కొన్నారు.

4. ల్యాబ్ సీజ్

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు వద్ద ఉన్న జ్యోతి ల్యాబ్‌ను ల్యాబ్ టెక్నీషియన్ లేరనే కారణంతో సీజ్ చేశారు వైద్యారోగ్య శాఖ అధికారులు. ఈ చర్యల వెనుక హోంమంత్రి అనిత ప్రమేయం ఉందని ఆరోపించారు ల్యాబ్ నిర్వాహకురాలు దాట్ల ఉమాదేవి. నిబంధనలు పాటించని ఇతర ల్యాబ్‌లను వదిలి.. తన ల్యాబ్‌ను మాత్రమే సీజ్ చేయాలని అధికారులకు మంత్రి చెప్పారని ఆరోపించారు.

5. ఇంటి ముందు ఫ్లెక్సీ

నోట్లకు ఓట్లు అమ్ముకోవద్దంటూ వినూత్నంగా ఆలోచించాడు హనుమకొండ జిల్లా మడిపల్లి గ్రామస్తుడు రమేష్. నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు తన ఇంట్లో లేవని.. ఓట్ల కోసం నోట్లు పట్టుకుని ఇంట్లోకి రావొద్దంటూ ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. నోట్లకు అమ్ముడుపోకుండా, గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేయాలని గ్రామస్తులకు సూచించాడు రమేష్.

6. ప్రమాణ సీకారంపై ఆగ్రహం

తిరుపతి జిల్లా నాగలాపురం సురుట్లపల్లి పలికొండేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. తనకు ఆహ్వానం లేకుండా ప్రమాణ స్వీకారం ఎలా నిర్వహిస్తారని ఈవోను నిలదీశారు. ఆలయ కమిటీలో స్మగ్లర్లు, ఈడీ కేసుల్లో ఉన్నవారిని ఎలా నియమిస్తారన్నారు అన్నారు ఎమ్మెల్యే ఆదిమూలం.

7. కలెక్టర్ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామాలను పెద్దహరివాణం మండలంలోకి తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 16 గ్రామాల ప్రజలు భారీగా ఆందోళన చేపట్టారు. 16 గ్రామాల్లో తొమ్మిది గ్రామాలను ఆదోని మండలంలోనే కొనసాగించాలని, తాము పెద్దహరివాణం మండలానికి వెళ్లబోమని వారు తేల్చి చెప్పారు.

8. దళారులు అక్రమాలు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారం వద్ద ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వడ్లకు ఇస్తున్న మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్‌ను సొమ్ము చేసుకునేందుకు ఆంధ్ర దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సన్న వడ్లను నేలకొండపల్లి మీదుగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలలోని మిల్లులకు తరలిస్తున్నారని అన్నారు.

9. ఫీజు బకాయిలు ఎగ్గొట్టి..

వైఎస్ఆర్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ జగన్ సమర్థవంతంగా అమలు చేశారని అన్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. నేడు కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని మూలనపెట్టేసి ఫీజు బకాయిలు ఎగ్గొట్టి విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తున్నారని విమర్శించారు.

10. హైస్కూల్లో తీవ్ర దుమారం

కాకినాడ జిల్లా యండపల్లి జడ్పీహైస్కూల్లో కుల వివక్ష తీవ్ర దుమారం రేపింది. ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు దళిత విద్యార్థులపై వివక్ష చూపిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీపీఎం లిబరేషన్ పార్టీ అధ్యక్షురాలు అప్పలరాజు ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. టీచర్ శ్రీనుబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

11. మాజీ ఎమ్మెల్యేపై బ్రహ్మానందరెడ్డి ఆరోపణ

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చదివారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. నరసరావుపేటలో ప్రభుత్వ భూమిని లాక్కొని కన్వెన్షన్ సెంటర్ కట్టారని ఆరోపించారు. తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలన్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

12. అభ్యర్థులతో ప్రమాణం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం కొనసాగుతోంది. మూడో విడతలో నాగర్ కర్నూల్ జిల్లా సిద్ధాపూర్ గ్రామంలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న సమయంలో ఆ గ్రామంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లపై నమ్మకం లేకపోవడంతో గ్రామ కాంగ్రెస్ పెద్దలు వారితో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు ప్రమాణం చేయించారు.

13. పైలెట్ ప్రాజెక్టు చేపడతాం

తిరుపతి ఐఐటీలో జరిగిన 8వ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి నారాయణ. నిర్మాణాలు సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయడానికి లీన్ కన్స్ట్రక్షన్ పద్ధతి అద్భుతమని ఆయన కొనియాడారు. నిర్మాణ రంగంలో వృధా, సమయం, డబ్బు ఆదా చేసే ఈ విధానాన్ని మున్సిపల్ అభివృద్ధిలో వాడుకుంటామని, ముందుగా ఒక పైలెట్ ప్రాజెక్టు చేపడతామని మంత్రి ప్రకటించారు.

14. దోపిడి ముఠా అరెస్ట్

ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ అధికారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసులు మూడు రాష్ట్రాల్లో 19 మంది అధికారుల నుంచి 82 లక్షలకు పైగా దోచుకున్నట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితుల నుంచి 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

15. సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి తన కారులో ఒక కుక్క పిల్లను తీసుకొని పార్లమెంట్ సమావేశాలకు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. అత్యంత భద్రత కలిగిన ప్రాంగణంలోకి పెంపుడు కుక్కను తీసుకురావడంపై భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. ఈ కుక్క ఎవరినీ కరవదని, కరవడానికి మనుషులు పార్లమెంట్ లోపలే ఉన్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

16. డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్

డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తునకు.. సీబీఐ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

17. క్షమాభిక్ష

అవినీతి కేసుల్లో ఐదేళ్లుగా విచారణ ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు అధికారికంగా లేఖ రాశారు. విచారణ వల్ల దేశానికి నాయకత్వం వహించడం కష్టమవుతోందన్నారు. ఈ విచారణ దేశాన్ని విభజిస్తోందని నెతన్యాహు పేర్కొన్నారు.

18. వీసా దుర్వినియోగం

అపార ప్రతిభ గల భారతీయుల నియామకం ద్వారా అమెరికా ప్రయోజనం పొందిందన్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. H-1B వీసా దుర్వినియోగం, ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ కంపెనీల ద్వారా జరుగుతోందని, ఇది వలస వ్యతిరేక భావనకు కారణమవుతుందని పేర్కొన్నారు. ప్రతిభావంతులకు అధిక జీతాలు ఇవ్వడం, సమాజానికి మేలు చేయడంపై దృష్టి పెట్టాలని మస్క్ సూచించారు.

19. పారదర్శకత పాటించాలి

బాక్సాఫీస్‌ నంబర్ల ఆధారంగా సినిమా ఫలితాన్ని అంచనా వేయడం దురదృష్టకరమన్నారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, ఇప్పుడు ఆ నంబర్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు సినిమాల్లోని సన్నివేశాలు, పాటల ఆధారంగా బాగుందా లేదా? అని నిర్ణయించేవారని గుర్తుచేశారు.

20. మ్యాచ్‌లు కష్టమే

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు జరగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా సేప్టీ క్లియరెన్స్ నివేదికను అందజేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కి అధికారిక నోటీసు జారీ చేసింది. స్టేడియానికి సంబంధించి వివరణాత్మక నిర్మాణ భద్రత నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×