బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ముగిసిన అధ్యయం కాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్లు విషయంలో ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా చేపడుతున్నారని తెలిపారు. ఈ కృషికి ఫలితమే గ్లోబల్ సమ్మిట్ రూపంలో కనిపిస్తుందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు మహేష్ గౌడ్.
రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి. స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ అన్నారు. అప్పుడు అసలు బీజేపీ లేదు కాబట్టే గాంధీ కుటుంబం మీద విమర్శలు చేస్తున్నారని చెప్పారు. స్వతంత్రం వచ్చిన రోజుల్లో దేశంలో ఆకలి చావులు లేకుండా చేసింది నెహ్రు అన్నారు. చరిత్రను రూపుమాపాలని బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
అంబేద్కర్ లాంటి మేధావి భారతదేశంలో పుట్టడం గర్వకారణం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా గంటూరులో వైసీపీ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. విజయవాడ నడబొడ్డున దేశంలోనే ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ స్మృతి వనం అశ్రద్ధకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో స్థానిక ఎన్నికల అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. గ్రామాల్లో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు.
మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్‌గేట్ వద్ద అనుమతులు లేకుండా ధాన్యం తరలిస్తున్న 11 లారీలను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకి చెందిన ఐదు లారీలు, ఏపీకి చెందిన ఆరు లారీలను సీజ్ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని.. ఇప్పటివరకు 70 లారీల వరకు వెనక్కి పంపించినట్లు తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. స్థానికులు, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు భారత రాజ్యాంగ ప్రవేశిక చదివి వినిపించారు. రాజ్యాంగ రచనలో ఆయన సేవలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చేసిన సేవలు మరువరానివని నాయకులు కొనియాడారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామ శివారులో క్షుద్రపూజలు కలకలం రేపింది. దారి మధ్యలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోసిన బూడిద గుమ్మడికాయ వంటి పూజాసామాగ్రి చూసి రైతులు భయాందోళనకు గురయ్యారు. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురై, ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇటువంటి వాటికి పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టితో పాటు మిగతా ఐఎఎస్, ఐపీఎస్ అధికారులపై మాజీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తిరుపతిలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహా యాదవ్ ఫైర్ అయ్యారు. తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద యాదవ సంఘాల నేతలతో నిరసన చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులు బయట పడుతుండడంతో భరించలేక అధికారులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా జంగపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పాతురి లావణ్యని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ ఎన్నికపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధి వైపు కొత్త దిశలో ప్రయాణం మొదలవుతుందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్ గుప్తా.. నూతన సర్పంచ్‌తో పాటు గ్రామ పాలక సిబ్బందిని సత్కరించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘర్షణ జరిగింది. పంచాయతీ ఎన్నికల మూడో విడత సందర్భంగా శంషారెడ్డిపల్లి తండా సర్పంచ్‌గా బానోత్ గణేష్ ఒక్కరే నామినేషన్ వేయగా.. చివరి నిమిషంలో ఆయన తనయుడు వినోద్ పోటీకి వచ్చారు. తండా వాసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన వినోద్ నామినేషన్ పత్రాలను చించివేశారు.
కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా రమేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. వైద్య కళాశాలలలో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు రమేష్ రెడ్డి. ర్యాగింగ్ చేసినట్లు రుజువు అయితే అడ్మిషన్ తొలగిస్తామని, పీజీ అడ్మిషన్లును నిబంధనల ప్రకారం కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. అడ్మిషన్లు, కౌన్సిలింగ్ పకడ్బందీగా, అక్రమాలకు తావులేకుండా నిర్వహిస్తామని తెలిపారు.
కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్త జనంతో కిటకిటలాడింది. స్వామివారికి నిత్య కళ్యాణం, హోమం వంటి సేవలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనకు మంత్రి సంధ్యారాణి హాజరుకాకపోవడంపై మాజీ మంత్రి పుష్పశ్రీవాణి వ్యంగ్యాస్త్రాలు స్పంధించారు. మీకు ఆహ్వానం లేదా? లేదంటే మీ సీఎం రావొద్దని చెప్పేసారా.. అంటూ ప్రశ్నించారు. సీఎం పర్యటనలో సంధ్యారాణి లేకపోవడం ఆమె స్థాయిని చిన్న చూపు చూస్తోందని విమర్శించారు
పుష్పశ్రీవాణి.
ఈనెల 15 న నర్సాపురం నుంచి చెన్నైకు వందే భారత్ ట్రైన్ ప్రారంభమవుతుందన్నారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఈ రైలు చెన్నైలో ఉదయం ఐదున్నర గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు నర్సాపురం చేరుకుంటుందన్నారు. తిరిగి నర్సాపురంలో మధ్యాహ్నం 2.50 గంటలకు రాత్రి 11.45 గంటలకు చెన్నై చేరుకుంటుందన్నారు. ఇది నెల రోజులు ముందుగానే ప్రారంభమవుతోందని ఆయన తెలిపారు.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు ఛార్జీలను నిర్ణయించింది. 500కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీ గరిష్టంగా 7వేల 500రూపాయలు వసూలు చేసుకోవచ్చంది. ఇక 500 కిలోమీటర్ల నుంచి 1000కిలోమీటర్ల వరకు గరిష్ట ఛార్జీ 12వేల రుపాయలు తీసుకోవచ్చని సూచించింది. అదేవిధంగా 1000 నుంచి 1500కిలోమీటర్ల వరకు గరిష్ట ఛార్జీ 15వేల రూపాయలుగా నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. అంతకుముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందుకు హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అభినందన లేఖ పంపింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించగా.. నీతీశ్ కుమార్ పదోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో ఆయనకు చోటు లభించింది. ఓ రాష్ట్రాన్ని పదిసార్లు పాలించడం ప్రజాస్వామ్య చరిత్రలో అరుదైన ఘనత అని పేర్కొంటూ సీఎం నీతీశ్‌కు అభినందన లేఖ పంపించింది.
శనివారం ఏకంగా 11 మంది క్రికెటర్లు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారిలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, RP సింగ్, కరుణ్ నాయర్, అన్షుల్ కాంబోజ్, సుయాష్ ప్రభుదేశాయి, ఆండ్రూ ఫ్లింటాఫ్, గ్లెన్ ఫిలిప్స్, సీన్ ఎర్విన్, హ్యారీ టెక్టర్ ఉన్నారు. దీంతో వీరందరినీ కలిపి నెటిజన్లు సరదాగా బర్త్‌డే టీమ్ అంటూ SMలో వైరల్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ డ్రా విడుదలైంది. ఈసారి ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 48 జట్లు పోటీపడనున్నాయి. గత ప్రపంచకప్ వరకు 32 జట్లే తలపడ్డాయి. జట్లను 12 గ్రూపులుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా గ్రూప్-జెలో ఉంది.
గుమ్మడి నర్సయ్య సినిమా కోసం తెలుగు నేర్చుకుంటాన్నారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. విప్లవ పార్టీ నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితంపై సినిమా రానున్న విషయం తెలిసిందే. గుమ్మడి నర్సయ్య పేరుతో రానున్న ఈ మూవీలో ఆయన నటిస్తున్నారు. నేడు ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్వంచలో జరిగింది.