సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 8 నుండి 20 వరకు ఈ రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతికి ఎక్కువ సర్వీసులు ఉన్నాయి. టికెట్ల రిజర్వేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి.
దేశంలో చలిగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. హిమాలయాలకు సమీపంలోని ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత చంపేస్తున్నది. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగనున్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలితోపాటు పొగమంచు కూడా తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
మెదక్ జిల్లాలోని కొనాయపల్లి పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారని ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని.. దాడికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోన్న వేళ.. క్షుద్రపూజల కలకలం రేపింది. ఖమ్మం జిల్లా గోళ్లపాడులో ఎన్నికల గుర్తుకి దుండగులు క్షుద్రపూజలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రవి ఓడిపోవాలని.. క్షుద్రపూజలు చేశారంటూ ఆపార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. పంచాయతీ ఆఫీస్ దగ్గర వాటిని వదిలి వెళ్లిన ఆనవాళ్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. కత్తెర గుర్తు స్లిప్ ఉంచి క్షుద్రపూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి స్వస్థలం శామీర్‌పేట మండలం ఆలియాబాద్.. పేరు శామ్‌గా పోలీసులు గుర్తించారు. ఎక్కడైనా చంపి ఇక్కడ పడేశారా అనే కోణంలో కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం తండా గ్రామపంచాయతీ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. బాణోత్ స్వప్న అనే వివాహితను భర్త రామన్న అదనపు కట్నం కోసం కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. భర్త రామన్న, అత్త బుజ్జి, మామ కిషన్‌తో పాటు మరిది నవీన్ నలుగురు కలిసి కొట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికులు రామన్న ఇల్లును ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ ధర్మారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. సాయిబాబా అనే అభ్యర్థి పోలింగ్ సెంటర్‌లో రిగ్గింగ్ చేస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. అభ్యర్థి వాసు వర్గం పోలింగ్ సెంటర్‌లోకి దూసుకొచ్చింది. పోలీసులకు ఆందోళన కారులకు మధ్య తోపులాట జరిగింది. 2గంటలుగా పోలింగ్ సెంటర్‌లో ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పి చెదరగొట్టారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వాగ్వాదం హింసకు దారితీయగా, స్వతంత్ర అభ్యర్థి వర్గానికి చెందిన ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో.. రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. జలాల్పూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అదేవిధంగా పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన 102ఏళ్ల వృద్ధురాలికి పూల మొక్కతో స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు కలెక్టర్ హనుమంతరావు.
మంచిర్యాల జిల్లాలో సర్పంచ్ అభ్యర్థికి గుండె పోటు వచ్చింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో అస్వస్థకు గురయ్యారు. తాండూరు మేజర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామి బరిలో ఉన్నారు. గుండెపోటు రావడంతో మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఏజెంట్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు, ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మీడియా వ్యక్తులు వెంటనే బయటకు వెళ్లిపోవాలని ఎస్సై హుకుం జారీ చేశారు. ఇదే సమయంలో, పోలింగ్ కేంద్రంలో అభ్యర్థులు ఏకంగా ప్రచారం చేస్తుంటే పోలీసులు మాత్రం నిలబడి చోద్యం చూశారని విమర్శలు వెల్లువెత్తాయి.
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రలోభాలు పతాక స్థాయికి చేరాయి. రెబల్స్ బెడదతో గెలుపును ప్రెస్టేజ్ గా తీసుకున్న ఓ మహిళా నాయకురాలు బలపర్చిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటుకు 3 వేల రూపాయలు, చీరలు పంచుతున్నట్లు సమాచారం. తొర్రూరు మండలంలోని అమ్మాపురం, చెర్లపాలెం, సోమారం, గుర్తూరు, మడిపెల్లి గ్రామాల్లో కాసుల వర్షం కురుస్తోంది. పంపిణీ కోసం ఒక్కో గ్రామానికి 50 మంది ఇంచార్జీలను నియమించినట్లు తెలుస్తోంది.
వనపర్తి జిల్లాలో పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో వనపర్తి మండలం చిమనగుంటపల్లిలో పోలింగ్ ఆగిపోయింది. దీంతో ఓటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8వ వార్డు BRS మద్దతు ఇచ్చిన అభ్యర్థికి చెందిన సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్‌పై రాకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. దీంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల సందర్భంగా.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎన్నికల రద్దీ, తనిఖీల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ముందుకు కదల్లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ వల్ల తాము గమ్యస్థానాలకు ఆలస్యమవుతున్నామని ప్రయాణికులు మండిపడుతున్నారు.
కృష్ణాజిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్ సెంటర్లో వాణిజ్య దుకాణాల సముదాయంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లోనే జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్ నెహ్రూచౌక్ శాఖ కార్యాలయం ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా అదుపులోకి రావడం లేదు.
భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం విధించిన 50శాతం సుంకాలకు ముగింపు పలకాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ముగ్గురు సభ్యులు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బాధ్యతారహిత సుంకాల వ్యూహంవల్ల ఆ దేశంతో కీలక భాగస్వామ్యం బలహీనపడుతోందని వారు అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్‌ను రష్యా దాడులు అంధకారంలోకి నెడుతున్నాయి. విద్యుత్ గ్రిడ్లు, సబ్ స్టేషన్లు, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో భారీగా విరుచుకుపడింది. 450 డ్రోన్లు, 30 క్షిపణులు ప్రయోగించింది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరపరా నిలిచిపోయింది. దాదాపు 10 లక్షలకు పైగా ఇళ్లు అంధకారంలో మగ్గుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
భారత దిగుమతులపై ఉన్న సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ టారిఫ్‌ల పెంపుపై స్పందించిన భారత్.. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తమ ఎగుమతిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే హక్కు ఉందని భారత అధికారి తెలిపినట్లు సమాచారం.
నేటి తరానికి దేశం, ధర్మం, దైవ భావనలను తెలియజేసే అఖండ-2.. అఖండ విజయం సాధించాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ -2’ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. అఖండ-2 చిత్రాన్ని ప్రశంసిస్తూ సినిమా అఖండ విజయం సాధించాలని దర్శకుడు బోయపాటి శ్రీనుని ఆశీర్వదించారు. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన చిత్రాలు మరిన్ని రావాలని మోహన్ భాగవత్ ఆకాంక్షించారు.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముంబయికి చేరుకున్నాడు. ఇటీవల సఫారీలతో మూడు వన్డేల సిరీస్‌లో ఆడిన అనంతరం విరాట్ లండన్ వెళ్లాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే కోహ్లీ ఫ్యామిలీతో కలిసి ముంబయికి వచ్చాడు. భారత పర్యటనలో ఉన్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిని కోహ్లీ దంపతులు కలిసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.