E-Paper
Advertisement

Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్

Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్

1. గద్వాలలో వాగ్వాదం.. ఏజెంట్ పాసులపై ఘర్షణ

జోగులాంబ గద్వాల జిల్లాలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో ఏజెంట్ పాసుల విషయంపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్వో నిర్లక్ష్య వైఖరి కారణంగా సర్పంచ్ అభ్యర్థి పాసులు ఇవ్వడం లేదని ఒక వర్గం ఆరోపించింది.

2. నారాయణపేటలో క్యూలైన్లో ఓటు వేసిన కలెక్టర్

నారాయణపేట జిల్లాలోని సింగారం గ్రామపంచాయతీలో జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్‌లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 25వ పోలింగ్ కేంద్రంలోని 10వ వార్డు బూత్‌కు చేరుకున్న కలెక్టర్.. నేరుగా బూత్‌లోకి వెళ్లి ఓటు వేశారు.

3. హైదరాబాద్‌లో విషాదం.. వివాహిత ఆత్మహత్య

గోల్నాక శాంతినగర్‌లో నాజ్నిన్ అనే యువతి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలే ఈ మృతికి కారణంగా తెలుస్తోంది. ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఎస్సై సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది.

4. చండ్రుగొండలో టెన్షన్.. గుర్తుల కేటాయింపుపై నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగో వార్డు పోలింగ్ బూత్‌ వద్ద అభ్యర్థుల గుర్తులను తప్పుగా ప్రదర్శించారంటూ బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భద్రు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.

5. నిజామాబాద్‌లో పోలింగ్ తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తనిఖీ చేసి.. పోలింగ్ ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. మొదటి విడతలో జరిగిన లోటు పాట్లు సవరించుకుని అన్నీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. గతం కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

6. డ్రోన్లతో గాలింపు.. దొరికిన సర్పంచ్ అభ్యర్థి భర్త

మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి భర్త చేర్యాల జనార్దన్ రెడ్డి.. ఓటమి భయంతో కనిపించకుండా పోయారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో డీఎస్పీ నరేందర్ గౌడ్ విచారణ చేపట్టారు. పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి.. జనార్దన్ రెడ్డిని పట్టుకున్నారు.

7. వలిగొండలో డీసీపీ తనిఖీలు.. భారీ బందోబస్తు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ జెడ్పీ పాఠశాలలో రాచకొండ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఐదు మండలాల్లో పోలింగ్ కొనసాగుతుండగా.. 1500 మంది పోలీసులతో భద్రత పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులతో సహా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

8. తిరుపతి పాలిటెక్నిక్ కాలేజీలో వివాదం..

తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధన జరుగుతుందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి క్లాస్ రూమ్ బోర్డ్‌పై తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. దీనిపై కాలేజ్ ఎదుట హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

9. పొందూరు ఖద్దర్‌కు అరుదైన గౌరవం..

శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి అరుదైన గుర్తింపు లభించింది. పొందూరు ఖద్దర్‌కు జియో గ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఖాదీ కార్మికులు, సొసైటీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

10. స్వగ్రామంలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాలలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగం మన సామాజిక బాధ్యతని, ప్రజలు ప్రలోభాలకు గురికావద్దని కోరారు. గ్రామ సేవకుడికి ధనబలం కాదు.. బుద్ధిబలం ముఖ్యమన్నారు.

11. కొడుకు అవయవదానం.. ఆదర్శంగా నిలిచిన తల్లిదండ్రులు

నంద్యాల జిల్లా పాములపాడు రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు వాసి ప్రశాంత్ మరణించారు. కొడుకు మరణించినా.. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కృష్ణవేణి గొప్ప సంకల్పంతో ప్రశాంత్ అవయవాలను ఆంధ్రప్రదేశ్ జీవనాధార్ సంస్థకు దానం చేశారు. వారి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు.

12. గోపాలపురంలో పెద్దపులి కలకలం..

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి.. పాదముద్రలు సేకరించారు. ప్రజలు, సమీప ఫ్యాక్టరీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

13. తిరువూరు టీడీపీలో మార్ఫింగ్ వార్.. ఎమ్మెల్యే వర్సెస్ రెబల్స్

తిరువూరు టీడీపీలో మార్ఫింగ్ ఫొటోల పంచాయితీ ముదిరింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఫొటోలను కొందరు టీడీపీ నేతలు పోస్ట్ చేయగా.. దీనికి కౌంటర్‌గా కొలికపూడి కూడా వారి ఫొటోలను AI సహాయంతో మార్ఫింగ్ చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర విమర్శలకు దిగడం కలకలం రేపింది.

14. రైలులో గ్యాస్ లీక్.. అన్నవరంలో ప్రయాణికుల పరుగులు

సిల్ఘటన్ నుంచి తమబరం వెళ్తున్న ట్రైన్‌లో ట్రైన్‌ సంబంధిత గ్యాస్ లీకై పొగలు వ్యాపించాయి. ఈ ఘటన అన్నవరం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ట్రైన్‌లో పొగలు రావడం గమనించిన ప్రయాణికులు.. అప్రమత్తమై రైలు ప్లాట్‌ఫామ్ మీదకు దూకేశారు. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి, ఆ బోగీకి సంబంధించిన రిపేరును పూర్తి చేశారు.

15. అవుకు జలాశయం పనుల పరిశీలన.. మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశాలు

నంద్యాల జిల్లాలోని అవుకు జలాశయం రివిట్మెంట్ మరమ్మత్తు పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. భవిష్యత్తులో లీకేజ్ సమస్య రాకుండా పనులు చేపట్టాలని ఆయన జలవనరుల శాఖ అధికారులకు సూచించారు.

16. క్యాన్సర్‌ను జయిస్తున్నా.. బ్రిటన్ రాజు చార్లెస్ వీడియో సందేశం

క్యాన్సర్‌పై పోరాటంలో తాను ముఖ్యమైన మైలురాయిని దాటాననీ, ఇక నుంచి వారం వారం చికిత్స మోతాదు తగ్గనున్నదని బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ జాతినుద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో తెలిపారు. త్వరగా రోగ నిర్ధారణ చేసి, సకాలంలో చికిత్స ప్రారంభించి, వైద్యుల సూచనలను తూచా తప్పకుండా పాటించడం వల్లనే కొత్త సంవత్సరంలో తన క్యాన్సర్‌ చికిత్సా కార్యక్రమం బాగా తగ్గనున్నదని వివరించారు.

17. నక్సలైట్ల ఆర్థిక మూలాలపై దెబ్బ.. రూ.92 కోట్ల ఆస్తుల జప్తు

వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్‌ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో రూ.92 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ చర్యల ద్వారా నక్సలైట్ల ఆర్థిక మూలాలను దెబ్బతీశామంది.

18. పిల్లలకు సోషల్ మీడియా వద్దు.. యూట్యూబ్ సీఈవో సూచన

పిల్లల్లో సోషల్‌ మీడియా వ్యసనంపై ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సామాజిక మాధ్యమాలను అధికంగా ఉపయోగించడం మంచిది కాదని.. అందుకే తమ పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచుతామని యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌ తెలిపారు.

19. వరల్డ్ టూర్ ఫైనల్స్: సాత్విక్-చిరాగ్ జంటకు కఠిన సవాలు

ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట క్లిష్టమైన గ్రూప్‌లో పడింది. ఈనెల 17న చైనాలోని హాంగ్జౌలో ఆరంభమయ్యే ఈ టోర్నీలో వీళ్లున్న గ్రూప్‌-బిలోనే.. ఒలింపిక్‌ పతకాలు గెలిచిన అరోన్‌ చియా-సోవుయ్‌ యిక్, లియాంగ్‌ వీయ్‌-వాంగ్‌ చాంగ్‌ జోడీలు కూడా ఉన్నాయి. గాయాల నుంచి కోలుకుని ఇటీవలే పునరాగమనం చేసిన సాత్విక్, చిరాగ్‌లకు ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ సవాల్‌ విసరనుంది.

20. చిరు-వెంకీ కాంబోపై అనిల్ రావిపూడి ఆనందం

అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్‌‌లను కలిపి ఒకే స్క్రీన్‌లో చూపించే అవకాశం తనకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మన శంకర వరప్రసాద్‌ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×