కొండసొరికల్లో కొలువైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బలిజమేడలమ్మ, గోళ్లకేతమ్మలతో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. సుమారు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు.
కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌ను నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. నబీన్ ప్రస్తుతం బీహార్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో రెండవ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 519, బీఆర్ఎస్ 165, బీజేపీ 46, ఇతరులు 164 మంది గెలుపొందారు. మొత్తం 4332 పంచాయతీలకు గాను 894 పంచాయతీ ఫలితాలు వెలువడ్డాయి.
ఈ నెల 19న బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్‌ఎస్ ఎల్‌పీ సమావేశం జరగనుంది. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కృష్ణా-గోదావరి జలాల కేటాయింపు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంపై చర్చ జరగనుంది.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూడవ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు టపాసులు పేల్చడంపై కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము రెండు వార్డుల్లో గెలిచాము అంటూ ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయగా.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సముదాయించారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంనగర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫలితం నమోదైంది. ఇక్కడ కాంగ్రెస్ తరుపున మామ సత్యనారాయణ పై కోడలు రాధిక బీజేపి తరుపున 14 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కసనగోడులో స్వతంత్ర అభ్యర్థి కందుల మోహన్ కుమార్ 220 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. అలాగే ఉప సర్పంచ్‌గా వీరమల్ల వెంకటేశం విజయం సాధించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.
పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. కేంద్రం ప్రకటించిన ఈ అరుదైన గుర్తింపుపై ఖాదీ కార్మికులు, సొసైటీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. GI ట్యాగ్ లభించడం వల్ల పొందూరు ఖాదీ పేరుతో అమ్ముడవుతున్న నకిలీ వస్త్రాలకు అడ్డుకట్ట వేయవచ్చని.. తద్వారా అసలు ఉత్పత్తుల నాణ్యత, గుర్తింపు నిలబడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రస్తుతం 22 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు.
దేశంలో చలిగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. హిమాలయాలకు సమీపంలోని ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత చంపేస్తున్నది. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగనున్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్‌లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థినులు హాస్టల్ మెస్ ఇన్‌చార్జి వినోద్ వేధింపులకు గురిచేస్తున్నాడని షీటీమ్స్‌కు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు ఫిర్యాదు చేశారు. గతంలో వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.. విద్యార్థినులు భయంతో షీటీమ్స్‌ను ఆశ్రయించారు. వినోద్‌పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
అల్లూరి జిల్లా పాడేరు మండలానికి చెందిన అంధ క్రికెటర్ పాంగి కరుణ కుమారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు నిత్యావసర సరుకులు, పరికరాలు అందజేశారు. ఇటీవల అంధుల టీ-20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో కరుణ ఉంది. పవన్ కళ్యాణ్ ఆమెకు 5 లక్షల రూపాయలు కూడా అందజేశారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిడ్నీ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం.. బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం పర్యాటకులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 8 నుంచి 20 వరకు ఈ రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతికి ఎక్కువ సర్వీసులు ఉన్నాయి. టికెట్ల రిజర్వేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి.
స్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో జగిరిన కాల్పుల ఘటనపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు పూర్తిగా అండగా నిలబడతామన్నారు. ఈ ఉగ్రచర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మోడీ.
ఉక్రెయిన్‌ను రష్యా దాడులు అంధకారంలోకి నెడుతున్నాయి. విద్యుత్ గ్రిడ్లు, సబ్ స్టేషన్లు, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో భారీగా విరుచుకుపడింది. 450 డ్రోన్లు, 30 క్షిపణులు ప్రయోగించింది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 10 లక్షలకు పైగా ఇళ్లు అంధకారంలో మగ్గుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
క్యాన్సర్‌పై పోరాటంలో తాను ముఖ్యమైన మైలురాయిని దాటాననీ.. ఇక నుంచి వారంవారం చికిత్స మోతాదు తగ్గనున్నదని బ్రిటన్ రాజు ఛార్లెస్ జాతినుద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో తెలిపారు. త్వరగా రోగ నిర్ధారణ చేసి, సకాలంలో చికిత్స ప్రారంభించి, వైద్యుల సూచనలను తప్పకుండా పాటించడం వల్లనే కొత్త సంవత్సరంలో తన క్యాన్సర్ చికిత్సా కార్యక్రమం బాగా తగ్గనున్నదని వివరించారు.
ముంబయిలో గతేడాది చోటుచేసుకున్న హిట్-అండ్-రన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. నిందితుడు మిహిర్ షా వేసిన పిటిషన్‌పై దర్యాప్తునకు నిరాకరించింది. ఇలాంటి అబ్బాయిలకు తగిన గుణపాఠం నేర్పించాల్సిందేనని శుక్రవారం వ్యాఖ్యానించింది. బైక్‌పై వస్తోన్న వారిని అతివేగంగా తన కారుతో ఢీకొట్టడమే కాకుండా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మరో పెళ్లికి సిద్ధమయ్యారు. దాదాపు ఆరేళ్ల రిలేషన్‌షిప్ అనంతరం గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని తాజాగా పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో స్వయంగా ఆయనే తెలిపారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిందని చెప్పారు.
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేకపోవడంపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం కాదని, టాప్-4లో బ్యాటింగ్ చేస్తూ పరుగులు చేయడం కూడా ప్రధాన బాధ్యతేనని అన్నారు.