దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోవల్కర్ తదితర ఆర్ఎస్ఎస్ లీడర్లు వారికసలు ఓటు హక్కే వద్దన్నారని సీఎం ఆరోపించారు. గాంధీజీ, అంబేద్కర్ పట్టుబట్టి.. వారికి ఓటు హక్కు కల్పించినందువల్లే వాళ్లు ప్రభుత్వంలో భాగస్వాములయ్యారని అన్నారు సీఎం రేవంత్.
హైదరాబాద్‌లోజర్నలిస్టు ఐ. వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు నాయుడు. విలీనం-విభజన పేరుతో ఎన్.అనురాధ తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ విలీనం, విభజన, అలాగే 22 మంది ముఖ్యమంత్రుల పాలనను ఈ పుస్తకంలో వివరించారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన అంధ క్రికెటర్ల వేదనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించారు. ప్రపంచకప్ విజేతలైన కెప్టెన్ దీపిక కుటుంబానికి 24 గంటల్లో టీవీ, ఫ్యాన్, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు పంపించారు. దీపిక స్వగ్రామం తంబలహట్టి తండాకు 6.2 కోట్ల రూపాయలతో రెండు రోడ్లు ఇప్పటికే మంజూరయ్యాయి.
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబిన్‌కు అభినందనలు తెలిపారు ఏపీ మంత్రి లోకేష్. ముఖ్యమైన బాధ్యతను చేపడుతున్నందుకు నితిన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. దేశ నిర్మాణం పట్ల NDA సమిష్టి నిబద్ధత మరింత బలోపేతం అవుతుందన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ రాజీవ్ కాలనీ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వారు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
వికారాబాద్ జిల్లా తాండూర్ రైల్వే స్టేషన్ పరిధిలో ప్రయాణిస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ తనిఖీల్లో దాదాపు 6 కిలోల పొడి గంజాయి ప్యాకెట్లతో పాటు గంజాయి కలిపిన చాక్లెట్లు కూడా సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం తండా గ్రామపంచాయతీ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. బాణోత్ స్వప్న అనే వివాహితను భర్త రామన్న అదనపు కట్నం కోసం కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. భర్త రామన్న, అత్త బుజ్జి, మామ కిషన్‌తో పాటు మరిది నవీన్ నలుగురు కలిసి కొట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నంద్యాల జిల్లా పాములపాడు రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు వాసి ప్రశాంత్ మరణించారు. కొడుకు మరణించినా.. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కృష్ణవేణి గొప్ప సంకల్పంతో ప్రశాంత్ అవయవాలను ఆంధ్రప్రదేశ్ జీవనాధార్ సంస్థకు దానం చేశారు. వారి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు.
ప్రకాశం జిల్లా గడ్డమీద పల్లిలో అత్తపై కత్తితో దాడి చేశాడు అల్లుడు చిన్నరావు. తన కుమార్తె మరణానికి అత్త కుటుంబమే కారణమని కోపంతో ఈ దాడికి పాల్పడ్డాడు. చిన్నరావు కూడా స్వయంగా గాయపరుచుకుని ఆసుపత్రిలో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరంలో భర్త వెంకటేష్, తన భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హత్య చేశాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లగా.. మాట్లాడదామని తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్య అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తుండగా పోలీసులు గమనించి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా కావలిలోని శివాలయంలో దొంగతనం జరిగింది. హుండీ పగలగొట్టి దొంగ నగదును అపహరించాడు. సీసీ కెమెరాల ద్వారా దొంగను గుర్తించారు. ఆలయ ఈవో రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు.
అనంతపురం జిల్లా పామిడి బస్టాండ్ ప్రాంతంలో మతిస్థిమితం లేని రవి అనే యువకుడు హల్‌చల్ సృష్టించాడు. కట్టె, రాడ్‌తో పాలు షాపులపై దాడి చేసి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకుని వచ్చిన పోలీసు వాహనంపై కూడా దాడికి పాల్పడ్డాడు. పోలీసులు చివరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని నందన మారెళ్ల బాలకోటేశ్వర ఆలయంలో దొంగలు చోరీకి యత్నించారు. ఆలయ తాళాలు పగలగొట్టి, అమ్మవారి తాళిబొట్టు అపహరించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే, ఎటువంటి దొంగతనం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతిచెందారు.
హైదరాబాద్ టోలిచౌకిలో ఇర్ఫాన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమ్ముడు అదనాన్, బిలాల్ అనే యువకుడికి మధ్య గొడవ జరుగుతుండగా ఇర్ఫాన్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బిలాల్ కత్తితో దాడి చేయడంతో.. తీవ్ర రక్తస్రావంతో ఇర్ఫాన్ మరణించాడు. పోలీసులు బిలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో జరిగిన మహాధర్నాలో మోడీ సర్కార్ పై పలు సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. భారత మాత ఎక్కడో ఉండదని.. ప్రతి భారతీయ పౌరులూ భరత మాత అంశే.. కాబట్టి వారిపై జరిగే ఏ దాడి అయినా సరే అది భారతమాతపై జరిగే దాడి అని చెప్పారామె. దేశంలో సవాలక్ష సమస్యలుంటే తిరిగితిరిగి వందేమాతరం వంటి గీతాల చర్చ అవసరమా? అని నిలదీశారు ప్రియాంక గాంధీ.
ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరలింపు వార్త చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిడ్నీ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం.. బాండి బీచ్‌లో పర్యాటకులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఇట్లు అర్జున అని పేరు పెట్టినట్లు టీమ్ ప్రకటించింది. ఈ మేరకు ప్రముఖ నటుడు నాగార్జున వాయిస్ ఓవర్‌తో రూపొందించిన టీజర్ ఆసక్తిగా సాగింది. అనీశ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు.
మూడో టీ20లో దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది భారత్. 118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ రాణించారు. అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 117లకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.