భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మేకల లత అనే మహిళా సెల్ఫీ వీడియో తీసుకుంటూ నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దళిత సంఘాలు తనను వేధిస్తున్నందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె ఆరోపించారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది1.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అమాంతం ఎగిరిపడ్డ వ్యక్తి.. అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయ. మృతుడు చిన్న ఘనపూర్ మండలంలోని ఐఎంఎల్ డిపోలో హమాలీగా గుర్తించారు2.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం వెంకయపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మద్దతుదారురాలు ఆలేటి ఇందిరా, ప్రత్యర్థి కుప్పిరెడ్డి వెంకటేశ్వరమ్మలకు సమానంగా 236 ఓట్లు పోలయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో టాస్ నిర్వహించారు. దీంట్లో కాంగ్రెస్ బలపరిచిన ఆలేటి ఇందిరా విజేతగా నిలిచారు3.
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలంలో పంచాయితీ ఎన్నికలు అత్తా, కోడళ్ల సమరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డిపై ఆమె అత్త డీకే ఆరుణ పైచేయి సాధించారు. గ్రామ సర్పంచ్‌గా ఎంపీ డీకే ఆరుణ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పంది జ్యోతి విజయం సాధించారు4.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 7వ వార్డు మెంబర్‌గా గెలిచిన మహేష్.. అర్ధరాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారు5.
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం రామోజీ పల్లి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వాలువాయి బాలమ్మకు వ్యతిరేకంగా.. అదే పార్టీ నేతలు బీఆర్ఎస్‌తో చేతులు కలిపారు. కాంగ్రెస్ రెబల్ వంశీని ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టి.. రెండు పార్టీల నేతలు కలిసి ప్రచారం నిర్వహించడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు6.
అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పితామహుడని, ఆయన నెల్లూరు జిల్లా వాసి కావడం గొప్ప విషయమని మంత్రి కొనియాడారు7.
ఖమ్మం జిల్లాలో గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. పెనుబల్లి మండలం బంజర్ రింగ్ సెంటర్‌లో గ్రానైట్ లారీపై నుంచి అకస్మాత్తుగా మూడు పెద్ద గ్రానైట్ రాళ్ళు కిందపడిపోయాయి. ప్రమాద సమయంలో ఎవ్వరూ అక్కడ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది8.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భూముల ధరలు పెరగడంతో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను దర్జాగా ఆక్రమిస్తున్నారు. దేవాలయాల పేరుతో రహదారుల పక్కన లక్షల విలువైన భూములను సైతం కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు9.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం గ్రామంలో గ్రూపు కక్షలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసినందుకు కంభంపాటి శ్రీధర్, రామ్మోహన్‌లపై గ్రామానికి చెందిన సాయి, అతని తండ్రి దాడి చేశారు. తాము మొదటి నుంచి టీడీపీలోనే ఉన్నామని.. గ్రామ నాయకులు తమను పార్టీలోకి కలుపుకోవడం లేదని బాధితులు వాపోయారు10.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను విజయవాడకు తరలిస్తూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీల ద్వారా ప్రత్యర్థులను ఉద్దేశించి ఒక్కొక్కడిని రప్పా రప్పా అంటూ హంగామా చేశారు11.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో సేకరించిన ప్రతులను వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ బాక్సులను కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, ఇతర వైసీపీ నేతలు స్వయంగా వాహనంలోకి లోడ్ చేశారు12.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ భవిష్యత్తుపై నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. జిల్లాల పునర్విభజనలో మండలాలు తరలిపోవడం వలన డివిజన్ కనుమరుగవుతుందని వైసీపీ ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆరోపించారు. దీనికి సమాధానంగా.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి ఏ కార్యాలయాలు తరలిపోవని, సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని.. నియోజకవర్గం అభివృద్ధి యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు13.
జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. భవానీ దీక్షా విరమణలు తుది దశకు చేరుకోవడంతో దుర్గమ్మ దర్శనార్ధం భవానీలు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే లక్షమందికి పైగా భవానీలు తరలివచ్చారు14.
ప్రకాశం జిల్లా దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డులోని పెద్ద మూలమలుపు వద్ద శ్రీ దుర్గా ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి.. అదుపుతప్పి డివైఢర్‌ను ఢీకొట్టింది. విశాఖ నుంచి భవాని దీక్ష స్వాములతో వెళ్తున్న ఈ బస్సులో డ్రైవర్ చాకచక్యం వలన సుమారు 40 మంది స్వాములు ప్రాణాలతో బయటపడ్డారు15.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిడ్నీ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం.. బాండి బీచ్‌లో పర్యాటకులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం16.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని స్థానంలో గ్రామీణులకు ఉపాధి కోసం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లు ప్రతులను సోమవారం లోక్‌సభ సభ్యులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి17.
ఢిల్లీని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమాన రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ప్రధానమంత్రి విదేశీ పర్యటనపై ప్రభావం చూపింది పొగ మంచు. ఆలస్యంగా విమానంగా బయలు దేరింది. అటు పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు18.
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమా పతంగ్. ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది19.
జాతీయ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన పీవీ నందిత 9.5 పాయింట్లతో విజేతగా నిలిచి రూ. 7 లక్షలు ప్రైజ్‌మనీ గెలుచుకుంది. మేరీ ఆన్ గోమ్స్ రన్నరప్‌గా నిలిచింది. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 7.5 పాయింట్లతో 11వ ర్యాంకు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొట్లూరి సుప్రీత 7.5 పాయింట్లతో 14వ స్థానం దక్కించుకుంది20.