శీతాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. డిసెంబంర్ 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. డిసెంబర్ 19న రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. ఆరోజు ఈ ఫిలిం సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
తెలంగాణ మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం అటవీ అతిథి గృహం వద్ద మూడు రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది పాపను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, పాపకు ఎడమ చేతికి నాలుగు వేళ్లు లేవని వైద్యులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐబొమ్మ రవికి కోర్ట్ షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. పోలీసుల కోరిక మేరకు రవిని మరో 12 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఒక్కో కేసులో 3 రోజుల పాటు విచారించాలని తెలిపింది. ఈ లెక్కన ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు ఉండగా.. మొత్తం 12 రోజుల పాటు విచారించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2బీ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్ ఎగ్జామ్‌ను మార్చి 3వ తేదీకి బదులుగా మార్చి 4వ తేదీ నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. మూడో తేదీన హోలీ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో పరీక్షను ఒకరోజు వాయిదా వేసినట్లు ప్రకటించింది.
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. రాయల్ కాలనీలో నివాసం ఉంటున్న ముర్షీద్ అలం అనే స్క్రాప్ వ్యాపారిని అబ్దుల్లా అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. పాత గొడవలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మయన్మార్ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ పాండురంగ నగర్ పోచమ్మ ఆలయంలో దుండగుడు చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన పూజారి వెంటనే అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. విచారణలో నిందితుడు పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఫ్రూట్స్ దుకాణాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌తో కాల్చివేశారు. దాదాపు 7 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. అంతేకాకుండా దుకాణం బయట ఉన్న రెండు స్కూటర్లు కూడా దగ్ధమయ్యాయని ఆరోపించాడు. పట్టణంలో దొంగతనాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్పగల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 25 ఏళ్ల వయసు గల యువకుడు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. బైక్ వేగంగా వచ్చి అదుపుతప్పడమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.
సింగరేణి సంస్థ సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. మాతృ విభాగానికి వెళ్తున్న బలరామ్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో సీఎండీగా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉన్న కృష్ణ భాస్కర్‌కు.. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి పూణేకు కారులో అక్రమంగా తరలిస్తున్న 112 కేజీల గంజాయిని ప్రత్యేక ఈగల్ పోలీస్ టీమ్ పట్టుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడిని గన్నవరం పోలీసులకు అప్పగించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ నటి స్వాతి దీక్షిత్, నటి ప్రణవి మానుకొండ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన ఓ సంఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మెకానిక్ బైక్‌ను తీస్తుండగా.. అకస్మాత్తుగా బయటకు వచ్చిన ఒక పాము క్షణాల్లో పక్కనే ఆపి ఉన్న యాక్టీవా స్కూటీలోకి దూరింది. దీంతో యాక్టీవా బైక్ స్పేర్ పార్టులను పూర్తిగా విప్పి, లోపలికి చొరబడిన పామును స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసి చంపేశారు.
అల్లూరి జిల్లావ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. లంబసింగి, అరకులో 6, చింతపల్లిలో 7, పాడేరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బీమా సవరణ బిల్లు-2025కు ఆమోదం లభించడంతో.. భారతీయ బీమా కంపెనీల్లో 100 శాతం వరకు విదేశీ సంస్థలు పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఇప్పటివరకు ఉన్న పరిమితులు తొలగిపోవడంతో అంతర్జాతీయ బీమా దిగ్గజాలు నేరుగా భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీకి అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా సంస్థ బీబీసీకి మధ్య వివాదం కొనసాగుతోంది. 2021 జనవరి 6వ తేదీన ఆయన చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఛానల్ తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసి ప్రసారం చేయడం వల్లే క్యాపిటల్ హిల్‌లో అల్లర్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ట్రంప్ తాజాగా గట్టి షాకిచ్చారు. సంస్థపై పరువు నష్టం దావా వేశారు.
ఓ ప్రముఖ మీడియా సంస్థ తన పెళ్లంటూ వార్త రాయడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నట్లు వార్త రాశారని.. అతడితో తనకు పరిచయం కూడా లేదని చెప్పారు. తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని మెహరీన్ స్పష్టం చేశారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రపంచమంతటికీ చెబుతానని అన్నారు.
ఇవాళ భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నిర్ణయాత్మకమైన నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం ఈ హై-వోల్టేజ్ పోరుకు వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడు పూర్తికాగా.. 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20లో గెలిచి సిరీస్‌ను ఎగరేసుకుపోయాలని భారత్ ఊవ్విళ్లురుతోంది. మరోవైపు సౌతాఫ్రికా సైతం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.