హైదరాబాద్ మైలార్దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపుతప్పి రోడ్డు పక్కన స్వెటర్స్ అమ్ముకునే షాప్‌లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఘటన సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. స్థానికులు ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గత 18 నెలల పాలన ఫలితాలను సమీక్షించడంతో పాటు, రాబోయే కాలానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం నాగిరెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని.. 17 ఏళ్ల బాలుడు చాక్లెట్ ఇస్తానని ఇంటిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసిన బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నాయన్నారు. ఈ కోవర్టుల వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ కోవర్డు సిస్టం లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో.. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచేదన్నారు.
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. BRS నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు MLAల అనర్హతపై ఆయన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ ఆఫీస్‌కు రావాలని… ఇప్పటికే ఐదుగురు MLAల అడ్వొకేట్లకు గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు.
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో ఓటింగ్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఓ దంపతులను అధికారులు ఓటేయనీయకుండా అడ్డుకున్నారు. ఓటర్ స్లిప్ లేదని వారిని ఓటు వేయకుండా అధికారులు ఆపారు. అయితే ఓటర్ లిస్టులో పేరుందని.. ఓటర్ కార్డు కూడా ఉందని ఓటర్లు చెబుతున్నా.. అధికారులు మాత్రం వినిపించుకోవడం లేదన్నారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్‌కు ఉచ్చు బిగుస్తుంది. తనను లైంగిక వేధిస్తున్నాడంటూ శోభారాణి అనే మహిళ హఫీజ్‌ఖాన్‌పై.. ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్, పదవి ఇప్పిస్తానని ఐదు కోట్ల డిమాండ్ చేయగా.. 3 కోట్ల 70 లక్షలు ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎర్రవెల్లి గ్రామస్థులు.. గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. గోకారం రిజర్వాయర్ కింద ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ పూర్తిగా ముంపునకు గురవుతుందని.. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసుల కస్టడీలో హింసించిన కేసులో.. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేశారన్నారు. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామకృష్ణరాజును కూడా పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వీల్ ఛైర్లు లేక అవస్థలు పడుతున్నారు. వయో వృద్ధులు సైతం కష్టాలు పడుతున్నామంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు.
GHMC వార్డు డీలిమిటేషన్‌పై అభ్యంతరాల స్వీకరణ తుది దశకు చేరుకుంది. ఇవాళ్టితో ఫిర్యాదుల స్వీకరణ గడువు ముగియనుంది. ఈనెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి 17 వరకు.. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు తీసుకుంటామని GHMC కమిషనర్ కర్ణన్ అన్నారు. ఇవాళ లాస్ట్ డే కావడంతో ఎన్ని ఫిర్యాదులు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ బాలానగర్‌లోని ఐడీపీఎల్ భూములపై విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రంగంలోకి దిగింది. సుమారు 20 వేల కోట్ల రూపాయల విలువైన ఐడీపీఎల్ భూములు కబ్జాకు గురవుతున్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ భూములకు సంబంధించిన తాజా స్థితిగతులపై విచారణ జరిపి ప్రభుత్వానికి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నివేదిక అందించనుంది.
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని ఇగ్నైట్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకేతన్ కళాశాలలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని.. క్యాంపస్‌లో సెకండ్ ఇయర్ విద్యార్థులను కలపడం వల్ల ర్యాగింగ్ జరిగి ఉంటుందని తండ్రి బలరామ్ ఆరోపిస్తున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం పేరు మార్చడంపై దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. పథకాన్ని తుదముట్టించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికకు వ్యతిరేకంగా పోరాడడానికి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తుందని అన్నారు.
శబరిమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. రోజుకు సుమారు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని కేరళ పోలీసులు ప్రకటించారు.
ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటిలో 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని ప్రపంచ దేశాలకు షాకిచ్చాడు. మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఏడు దేశాల నుంచి అమెరికాలో పర్యటించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ట్రంప్ వచ్చాక ఇప్పటి వరకు 39 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు.
రామ్‌చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలోని చికిరి పాట.. విడుదలైన నెల రోజుల్లోనే తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ దాటిందని చిత్రబృందం ప్రకటించింది. అలాగే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముంబైకి చెందిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్తని మోసం చేశారనే అభియోగాలపై కొన్ని నెలల క్రితం నటి శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదైంది. ఈ మేరకు జుహు పోలీసులు దీనిని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా.. దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. రూ.60 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
డబ్ల్యూటీఏ ఈ ఏడాది ఉత్తమ ప్లేయర్ అవార్డును అర్యానా సబలెంకా గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని పొందడం ఈ బెలారస్ స్టార్‌కు వరుసగా ఇది రెండోసారి. యుఎస్ ఓపెన్ టైటిల్ గెలవడం, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరడం, సీజన్‌లో నంబర్ వన్‌గా ముగించడంతో సబలెంకాకు అవార్డు దక్కింది. వరుసగా రెండు సీజన్లలో ఈ పురస్కారం అందుకున్న సెరెనా విలియమ్స్, ఇగా స్వైటెక్ సరసన సబలెంకా చోటు దక్కించుకుంది.