తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారుల పనితీరును విశ్లేషించారు. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తు లక్ష్యాల సాధనపై దిశానిర్దేశం చేశారు.
ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయల నగదు పురస్కారం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముఖ్యంగా క్వాంటం టెక్నాలజీ రంగంలో ఈ ఘనత సాధించే వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని జ్ఞానభూమి వద్ద ప్రముఖులు ఘన నివాళులర్పించారు. పీవీ దేశానికే గర్వకారణమని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.
ఒడిశాలోని మల్కాంగిరి జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేరళపాల్ ఏరియా కమిటీ, డోర్నపాల్ LOSకు చెందిన 22 మంది సభ్యులు ఒడిశా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరు తమతో పాటు ఒక AK-47, రెండు INSAS, ఒక SLR రైఫిల్ సహా మొత్తం తొమ్మిది ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ పరిధిలో ఉన్న లింమ్రా ఫర్నిచర్ అండ్ సోఫావర్క్ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపులో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా వెలువడిన నిప్పురవ్వలు, అక్కడ ఉన్న ఫోమ్, ఇతర ఫర్నిచర్ సామాగ్రికి అంటుకోవడంతో మంటలు క్షణాల్లో షాపు అంతటా వ్యాపించాయి.
హైదరాబాద్ బోడుప్పల్ బృందావన్ కాలనీలో జరిగిన అశోక్ హత్య కేసులో మేడిపల్లి పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన ఇంటికి ఎదురుగా ఉన్న సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు నిందితులు మహేష్, సాయి పూర్ణిమ ఇంటిలోకి వెళ్లిన, బయటకు వచ్చిన సమయాలు ఇందులో రికార్డ్ అయ్యాయి.
అల్లూరి జిల్లా రంపచోడవరంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే శిరీష అవినీతిలో నెంబర్ వన్ అని, ఆమె స్థాయి వార్డు మెంబర్ కన్నా తక్కువని ఎమ్మెల్సీ అనంతబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ అనంతబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డమ్మీ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించలేదని, ఊక లారీల్లో గంజాయి, అక్రమ కలప తరలించిన చరిత్ర తనది కాదని ధ్వజమెత్తారు.
జనగామ జిల్లా కోర్టులో విచారణకు వచ్చిన అర్చనపై ఆమె బావ నర్సింహులు బండరాయితో తలపై దాడి చేశాడు. పాత కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ, నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అర్చనను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసనసభలోని పీవీ లాంజ్ లో ఆయన చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీవీ కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం భారీ స్మృతి వనం, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వెంకటపాలెం సమీపంలో 2.5 ఎకరాల్లో దీనిని నిర్మిస్తున్నారు. అటల్-మోదీ సుపరిపాలన వేడుకల ముగింపు సందర్భంగా ఈనెల 25న సీఎం చంద్రబాబు దీనిని ఆవిష్కరించనున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో వర్గపోరు వీధికెక్కింది. ఇంచార్జ్ గజ్జల భార్గవ్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచరులు, మండల స్థాయి నేతలు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన పార్టీ అధిష్టానం, అసంతృప్త నేతలను చర్చల కోసం తాడేపల్లికి పిలిపించింది.
ఏపీలో మొత్తం 14 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. విశాఖలోని జగదాంబ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు సహా ఇద్దరు సిబ్బందిపై కేసు నమోదు చేసింది. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ, ఐదుగురు సిబ్బంది నివాసాల్లో 6 చోట్ల సోదాలు చేసింది.
నటుడు శివాజీ ఇటీవల తన సినిమా దండోరా ప్రమోషన్స్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై నటి అనసూయ భరద్వాజ్ ఘాటుగా స్పందించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కాసం ఫ్యాషన్స్ అనే బట్టల దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మన్యం జిల్లాలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తీరుపై పాలకొండ టీడీపీ ఇంచార్జీ పడాల భూదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి నేతలకు, కార్యకర్తలకు అలకలు వీడి కలిసి కట్టుగా పనిచేయాలని అధిష్టానం సూచించినా.. జయకృష్ణ తీరులో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె.
అమెరికా హెచ్-1బీ వీసా జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం స్థానంలో వేతన ఆధారిత లాటరీ వ్యవస్థ రానుంది. దీనివల్ల నైపుణ్యం, అధిక వేతనం ఉన్న దరఖాస్తుదారులకే వీసాలు దక్కే అవకాశాలు మెరుగుపడతాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన.. గతంతో పోలిస్తే బిహార్‌లో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు, శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని అభినందించారు.
ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనేక తప్పులు ఉన్నాయని, అర్హులైన వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు.
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26కు కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా కిషన్ ఎంపికయ్యాడు. కిషన్ ఇటీవలే జార్ఖండ్‌కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సినీ నటి మంచు లక్ష్మి విచారణ ముగిసింది. సోమవారం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి హాజరైన ఆమెను అధికారులు సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు, ఆఒప్పందాలు ఎలా జరిగాయనే వివరాలను సేకరించారు.