మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మేడారంలో పర్యటించి జాతర పనులను పరిశీలించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతర పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోని గ్రానైట్ పనులను పది రోజుల్లో ముగించాలని సూచించారు.
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 37,243 కేసులు నమోదు కాగా, ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ నేరాలు 40 శాతం తగ్గాయన్నారు. అలాగే 117 డిజిటల్ అరెస్ట్ కేసులు నమోదు కాగా, 16.85 కోట్ల విలువైన మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలను కమిషన్ లీగల్ టీమ్ పరిశీలిస్తోందని చైర్‌పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
హైదరాబాద్ అత్తాపూర్ పిల్లర్ నెం. 191 వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్దుల్ సత్తార్ మృతి చెందారు. డ్యూటీ ముగించుకుని వెళ్తుండగా డీసీఎం వాహనం ఆయనపైకి దూసుకెళ్లింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
నిర్మల్ జిల్లా కడెంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా యూరియా కోసం గ్రోమోర్ చుట్టు తిప్పించుకుంటూ యూరియా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. అలాగే బస్తాకు 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు.
తాడేపల్లిగూడెం కూటమి సమావేశంలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లోనూ చంద్రబాబు సీఎంగా ఉండేలా కూటమి పనిచేస్తుందని, తమ ఐక్యతను ఎవరూ విడదీయలేరన్నారు. వైసీపీ నేతలను హెచ్చరిస్తూ.. కూటమి తలచుకుంటే ఏపీ మరో యూపీ అవుతుందని, పరిస్థితిని అక్కడిదాకా తెచ్చుకోవద్దని ఆయన సూచించారు.
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఇబ్రహీంపేట గ్రామ ప్రథమ సర్పంచ్‌గా ఎడవల్లి వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన అజెండా అని తెలిపారు వంశీకృష్ణారెడ్డి. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇబ్రహీంపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
సన్ పరివార్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులో 153 కోట్ల రూపాయల స్కామ్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏడాదికి 100 శాతం లాభాలంటూ మెతుకు రవీందర్ 10 వేల మందిని మోసగించి 158 కోట్లు వసూలు చేశాడు. ఇందులో 26 కోట్లు వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు 2021 నాటి ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పునిచ్చింది. భూవివాదంతో మంజనాయక్, అతని ఇద్దరు కుమారులను గొడ్డళ్లతో నరికి చంపిన 9 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ శిక్ష ఖరారు చేసింది.
భువనగిరి జిల్లా రాయగిరిలో ఆర్‌ఆర్‌ఆర్ నిర్వాసితులతో కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల భూముల కోసం అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారని, ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. అలైన్‌మెంట్ మారుస్తామన్న హామీపై మంత్రి కోమటిరెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంతో పాటు 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సుమారు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో 3 కిలోల బంగారం, 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకుని, కిషన్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తనపై పెట్టిన కేసుల గురించి ఆర్ఆర్ఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని సునీల్ కుమార్ మండిపడ్డారు. సీబీఐ కేసులో ఆయన సాక్షులను ప్రభావితం చేసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు.
అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న శబనా అనే మహిళకు చెందిన 15 తులాల బంగారం మాయమైంది. పోలీసులు కలెక్టరేట్ వద్ద బస్సును ఆపి తనిఖీ చేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం దాడికి దారితీసింది. అజ్గర్ అనే మైనార్టీ యువకుడిపై గురువాయపాలెంకు చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లతో మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతరం అతడిని ఆటోలో తీసుకెళ్లి మరోసారి దాడి చేయగా, బాధితుడు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.
చత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూర్‌లో మావోయిస్టుల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్ట హిల్స్‌లో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో భారీగా ఆయుధ మరమ్మతు పరికరాలు, BGL సెల్ తయారీ సామాగ్రి లభించాయి.
డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని గ్రీన్ ల్యాండ్‌కు ప్రత్యేక దూతగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ట్రంప్ స్పందించారు. అమెరికాకు జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్‌లాండ్ కావాలని.. ఖనిజాల కోసం కాదని అన్నారు.
జర్మనీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే వినడం ఒక కళ అనే శీర్షికతో ఒక గంట నిడివి గల వీడియోను విడుదల చేసింది.
ఆసియా కప్‌లో భారత అండర్-19 కెప్టెన్ ఆయుష్ మాత్రే ఘోరంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 65 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫైనల్లో పాక్‌పై వ్యక్తిగత వైఫల్యంతో పాటు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జట్టు కొంపముంచింది. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమై, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విమర్శల పాలయ్యాడు.
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం చిత్రం రూపొందుతోంది. సమంత సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ 1980ల నాటి క్రైమ్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య నటిస్తున్నారు. సమంతతో కెమిస్ట్రీ బాగుంటుందని, ఆమె ప్రొడ్యూసర్ అయినప్పటికీ సెట్‌లో నటిగానే సులభంగా కలిసిపోతారని ఆయన కొనియాడారు.