E-Paper
Advertisement

Top 20 News: కైలాసగిరిపై తప్పిన పెను ప్రమాదం.., మావోయిస్టులకు వ్యతిరేకంగా.. రోడ్డుపై నిరసన

Top 20 News: కైలాసగిరిపై తప్పిన పెను ప్రమాదం.., మావోయిస్టులకు వ్యతిరేకంగా.. రోడ్డుపై నిరసన

1. ఘన నివాళి

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల కన్నుమూసిన పార్టీ సీనియర్ నేతలు శివరాజ్ పాటిల్, శివ ప్రకాష్ జైస్వాల్ మృతికి సంతాపం తెలుపుతూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

2. ముస్తాబవుతున్న మేడారం

మహాజాతరకు మేడారం కొత్త కొత్తగా ముస్తాబవుతోంది. అడవి తల్లి ఒడిలో కొలువుదీరి, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… ఆలయాన్ని అద్భుతంగా ఆధునీకరిస్తోంది ప్రభుత్వం.

3. ఆకస్మిక తనిఖీ

వికారాబాద్ జిల్లా తాండూరులోని రాజీవ్, ఇందిరమ్మ కాలనీల్లో యలాల్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం నూర్ అహ్మద్ అనే వ్యక్తి హత్యకు గురైన నేపథ్యంలో, కాలనీల్లో మద్యం, గంజాయి విక్రయాలపై ప్రజలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రతి ఇల్లు, షాపును తనిఖీ చేసిన పోలీసులు బెల్ట్ షాపుల్లో భారీగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

4. అటవీ శాఖ అధికారుల హెచ్చరిక

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, తొగుట మండలాల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వరదరాజుపల్లి శివారులో పులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయిలో మూడు బృందాలతో గాలింపు చేపట్టారు. పులి కదలికలను కనిపెట్టేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ కుమార్ తెలిపారు. పులి సంచారం నేపథ్యంలో రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

5. ఏటీఎంలను టార్గెట్ చేస్తున్న ముఠా

వరంగల్ నగరంలో ఏటీఎంలను టార్గెట్ చేస్తూ ఒక ముఠా కొత్త తరహా దోపిడీకి పాల్పడుతోంది. ఏటీఎం క్యాష్ డిస్పెన్సర్లలో ప్లేట్స్ అమర్చి, నగదు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. సర్వర్ సమస్య అనుకుని కస్టమర్లు వెళ్లగానే.. ఆ నగదును దొంగిలిస్తున్నారు. గత పది రోజుల్లో సుమారు రూ. 4 లక్షలు మాయమవడంతో బ్యాంక్ మేనేజర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

6. విస్తరణ చేపట్టాలి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరుతూ ఆర్ఎన్. రాజు అనే యువకుడు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నా, ట్రాఫిక్ సమస్యతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిరసనకు స్థానిక ప్రజలు మద్దతు తెలిపి, వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

7. మందుబాబుల వీరంగం

రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి బిగ్ డాడీ బార్ వద్ద మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యంమత్తులో మందుబాబులు రెచ్చిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ వద్ద ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవ అనంతరం బైక్స్‌పై పారిపోయారు. మందుబాబుల దాడిలో గాయపడిన బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

8. సంస్మరణ దినం

ఆయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సీబీఐ విచారణ సైతం దోషులను పట్టుకోలేకపోయిందని.. ఇకపై పోరాడే శక్తి తమకు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో న్యాయంపై నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు. ఆయేషా హత్య జరిగిన రోజును ‘సంస్మరణ దినం’గా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

9. భక్తుల రద్దీ

వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉచిత దర్శనానికి 5 గంటలు, టికెట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండటంతో ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తూ శివసేవకులు సేవలు అందిస్తున్నారు. వాహనాల రద్దీ పెరగడంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ట్రాఫిక్ నియంత్రిస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

10. మంత్రి కీలక వ్యాక్యలు

మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం ఉత్తమమైనదని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిందన్నారు. పీపీపీ విధానంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందుకు వచ్చిన వారిని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు.

11. ఎమ్మెల్యే పై గ్రామస్థుల ఆగ్రహం

గుంటూరు జిల్లా మందడం గ్రామంలో దొండపాటి రామారావు కుటుంబాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరామర్శించారు. ఆయనతో పాటు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌పై కొందరు గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిరసనకారులు ఎమ్మెల్యేను నిలదీశారు.

12. కైలాసగిరిపై తప్పిన పెను ప్రమాదం..

విశాఖలోని కైలాసగిరి కొండపై పెను ప్రమాదం తప్పింది. విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో నడుస్తున్న టాయ్ ట్రైన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా వెనక్కి దూసుకెళ్లింది. రైలులోని ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేయగా, అప్రమత్తమైన తోటి పర్యాటకులు పట్టాలపైకి దూకి చాకచక్యంగా రైలును నిలిపివేశారు. పర్యాటక సీజన్ రద్దీ కారణంగా.. విరామం లేకుండా రైలును నడపడం వల్లే ఈ సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. పెను ప్రమాదం తప్పడంతో నిర్వాహకులు, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

13. రహస్యంగా విచారణ

పల్నాడు జిల్లా అడిగొప్పులలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నాగార్జున సాగర్ సమీపంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ నెల 22న జరిగిన ఈ దారుణ ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఆరా తీస్తున్నారు.

14. మావోయిస్టులకు వ్యతిరేకంగా.. రోడ్డు పై నిరసన

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గ్రామస్తులు, వ్యాపారులు రోడ్డుపై నిరసన చేపట్టారు. మావోయిస్టులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. ఏజెన్సీ అభివృద్ధికి వారు అడ్డంకిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. వారాంతం కావడంతో ఈ ధర్నా వల్ల సుమారు ఐదు కిలోమీటర్ల మేర పర్యాటక వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. తమ ప్రాంతంలో శాంతిభద్రతలు కాపాడి, అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.

15. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆరోపణ

కాకినాడ జిల్లాలో ఆరోగ్యశ్రీ, సిఎంఆర్ఎఫ్ నిధులను కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. రోగులను తప్పుదోవ పట్టిస్తూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, తన వద్ద ఉన్న సాక్ష్యాలను అందజేస్తానని ప్రకటించారు.

16. ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ

US అధ్యక్షుడు ట్రంప్ రేపు ఫ్లోరిడాలో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు, శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో 90% మేర ఏకాభిప్రాయం కుదిరిందని జెలెన్ స్కీ చెప్పారు. రేపటి భేటీలో ఉక్రెయిన్కు US ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. కొత్త ఏడాదికి ముందే కీలక పరిణామాలు సంభవించొచ్చని తెలిపారు.

17. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

ఓ అత్యాచార కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి, బాధితురాలు ముందు ఏకాభిప్రాయంతోనే ఉన్నారని.. ఆ తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాల వల్ల అతడిపై కేసు నమోదు చేసినట్లు గమనించామని న్యాయమూర్తులు జస్టిస్‌ నాగరత్న, సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

18. ప్రమాదకర స్థాయికి

ఢిల్లీలో గాలి నాణ్యత మళ్ళీ క్షీణించింది, AQI 400 దాటడంతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరేకుంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమాన్యత(Visibility) తగ్గి విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం నగరంలో గ్రాప్-3 (GRAP-3) ఆంక్షలు అమలవుతుండగా, వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

19. వరుసగా 5 సెంచరీలతో రికార్డు

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ ధ్రువ్ షోరే రికార్డు సృష్టించారు. హైదరాబాద్ రాజ్కోట్లో నిన్న జరిగిన మ్యాచ్లో 77 బంతుల్లో అజేయంగా 109 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్లు) చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో లిస్ట్-A క్రికెట్లో వరుసగా 5 సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్గా తమిళనాడు ప్లేయర్ జగదీశన్ రికార్డును సమం చేశారు. ఈ మ్యాచ్ లో విదర్భ 365 రన్స్ చేయగా, హైదరాబాద్ 276కే పరిమితమైంది.

20. శివాజీ కామెంట్స్‌పై నాగబాబు స్పందన

మహిళల డ్రెస్‌ల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్‌ను నాగబాబు తప్పు పట్టారు. సమాజం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని వాటినుంచి బయటకు రావాలన్నారు. మోడ్రన్‌ దుస్తులు ధరించడం తప్పు కాదన్నారు. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు వారి డ్రెస్‌ల వల్ల కాదని.. మగవాళ్ల క్రూరత్వం వల్ల అని నాగబాబు అన్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×